మగ బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి బాలిక.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కలకలం రేపింది.

Published : 12 Jan 2024 02:09 IST

చిక్‌బళ్లాపూర్‌: పద్నాలుగేళ్ల బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. జనవరి 9న జరిగిన ఈ షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుమకూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక మంగళవారం ఓ ఆస్పత్రిలో ప్రసవించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే...  విద్యార్థిని ఇటీవల హాస్టల్‌ నుంచి తన ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్‌ చేసిన వైద్యులు ఆమె గర్భంతో ఉన్నట్లు వెల్లడించారు.  దీంతో ఏం జరిగిందో తెలియక ఆ తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు.  అప్పటికే ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న బాలికకు వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ప్రసవం చేశారు. బాలిక బరువు తక్కువగా ఉన్నప్పటికీ.. శిశువు, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు, వైద్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇప్పించగా.. పాఠశాలలో సీనియర్‌ విద్యార్థే తాను గర్భం దాల్చడానికి కారణమని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.  అయితే, బాలుడిని విచారించగా నిరాకరించాడన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులూ చేయలేదని వెల్లడించారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఏమీ మాట్లాడటంలేదని.. వాళ్లకు కౌన్సెలింగ్‌ కొనసాగుతోందని చెప్పారు. బాలిక చెబుతున్న మాట్లలో నిలకడ లేదన్నారు. పాఠశాలలో మరో విద్యార్థి పేరు కూడా చెబుతోందని.. అందువల్ల అందరినీ విచారించి బాధ్యుల్ని గుర్తిస్తామని సీనియర్‌ పోలీస్‌ అధికారి వివరించారు. మరోవైపు, ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు సీరియస్‌గా స్పందించారు. బాలిక చదువుతున్న హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని