Narayana Murthy: దగ్గుమందుతో చిన్నారుల మృతి.. బాధాకరం..

కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌లు తయారు చేసినప్పటికీ పరిశోధనా రంగంలో భారత్‌ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దగ్గు మందుతో ఇటీవల ఆఫ్రికాలో చిన్నారులు చనిపోవడం మన దేశానికి ఓ మచ్చ అని అన్నారు.

Published : 16 Nov 2022 01:49 IST

బెంగళూరు: కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేసి, భారీ స్థాయిలో పంపిణీ చేయడంలో భారత్‌ విజయం సాధించినప్పటికీ.. శాస్త్ర పరిశోధనలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి పేర్కొన్నారు. భారత్‌లో తయారైన దగ్గుమందుతో ఇటీవల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ‘ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేసిన ఓ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.

‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ 100కోట్ల డోసులను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు భారత్‌ కంపెనీలు ఎగుమతి చేయడం గొప్ప విజయం. కస్తూరి రంగన్‌ కమిటీ సిఫార్సులతో రూపొందిన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరం. ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌తోపాటు ఇతరులు లండన్‌లోని రాయల్‌ సొసైటీ నుంచి ఫెలోషిప్‌ పొందడం గొప్ప విషయమే. భారత్‌ అభివృద్ధి పథంలో ఇవన్నీ స్ఫూర్తిదాయక, సంతోషాన్నిచ్చేవే. అయినప్పటికీ మనకు ఎన్నో భారీ సవాళ్లు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

‘అంతర్జాతీయ యూనివర్సిటీ ర్యాంకుల్లో టాప్‌ 250ల్లో కనీసం ఒక్క భారతీయ విద్యా సంస్థ కూడా లేదు. వ్యాక్సిన్‌లు తయారు చేసినప్పటికీ అవి అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికతను వినియోగించుకోవడమో లేదా వారి పరిశోధనల ఆధారంగానే ఉత్పత్తి చేయడమో జరిగింది. ఇదే సమయంలో గడిచిన 70ఏళ్లుగా వేధిస్తోన్న డెంగీ, చికున్‌గన్యా వంటి వ్యాధులకు ఇంకా వ్యాక్సిన్‌ తయారు చేయలేదు’ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఇక భారత్‌ తయారు చేసిన దగ్గు మందు వల్ల గాంబియాలో ఇటీవల 66 మంది చిన్నారులు చనిపోవడం మన ఫార్మా నియంత్రణ సంస్థల విశ్వసనీయతకు ఓ మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వీటిని అధిగమించడానికి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అవసరమన్నారు. ఇందులో భాగంగా పరిశోధనా రంగంలో ఉపాధి అవకాశాలతో యువతను ఆకర్షించే విధానాలకు శ్రీకారం చుట్టాలని నారాయణ మూర్తి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు