Police Station: లాకప్‌లో అరగంట అక్రమ నిర్బంధం.. పోలీసులకు రూ.50వేల ఫైన్‌!

ఓ వ్యక్తిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకొని, స్టేషన్లో అరగంట పాటు నిర్బంధించినందుకు (illegal detention) రూ.50వేల ఫైన్‌ను దిల్లీ హైకోర్టు విధించింది.

Published : 06 Oct 2023 18:17 IST

దిల్లీ: పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా అదుపులోకి తీసుకొని, స్టేషన్లో నిర్బంధించడంపై (illegal detention) దిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. లాకప్‌లో అరగంటపాటు అక్రమంగా ఉంచినందుకు బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనతో ప్రమేయమున్న ఇద్దరు పోలీసు అధికారుల నుంచే ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించడం గమనార్హం. ఈ కేసులో పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని పేర్కొన్న న్యాయస్థానం (Delhi High Court).. సామాన్య పౌరుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరిస్తోన్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఓ కూరగాయల విక్రేతకు, మహిళకు మధ్య గతేడాది సెప్టెంబర్‌లో గొడవ జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దాదాపు అరగంట పాటు లాకప్‌లో బంధించిన అనంతరం అతడిని విడిచిపెట్టారు. అయితే, పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్న బాధితుడు.. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించినందుకుగానూ పరిహారం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

ప్రభుత్వ ‘విధానపర నిర్ణయాలను’ అడ్డుకోలేం : సుప్రీం కోర్టు

ఈ కేసును విచారించిన జస్టిస్‌ సుబ్రమణ్యన్‌ ప్రసాద్‌.. పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ లేకుండా బాధితుడిని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అరెస్టు చేయకుండానే ఘటనాస్థలం నుంచి తీసుకువచ్చి, అకారణంగా లాకప్‌లో కూర్చోబెట్టారు. అతడు లాకప్‌లో గడిపిన కాలం తక్కువే అయినప్పటికీ.. పిటిషనర్‌ స్వేచ్ఛను హరించిన పోలీసులను తీరును సమర్థించలేం. ఈ విషయంలో వారు చట్ట ప్రకారం నడుచుకోలేదు. పోలీసులూ చట్టానికి అతీతులు కాదనే సందేశం వెళ్లాలి. అందుకే పిటిషనర్‌కు రూ.50 వేల పరిహారం అందించాలి. ఈ మొత్తాన్ని సదరు పోలీసు అధికారుల జీతాల నుంచే చెల్లించాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని