Caste survey: రాష్ట్ర ప్రభుత్వ ‘విధానపర నిర్ణయాలను’ అడ్డుకోలేం : సుప్రీం కోర్టు

బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను (Caste survey) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు (Supreme Court).. రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది.

Published : 06 Oct 2023 14:12 IST

దిల్లీ: బిహార్‌ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనకు (Caste survey) సంబంధించి తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా నిరోధించడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాన్ని (Policy Decisions) అడ్డుకోలేమని స్పష్టం చేసింది. బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణను 2024 జనవరికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేను (Caste survey) సమర్థిస్తూ ఆగస్టు 2న పట్నా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ, ‘ఏక్‌ సోచ్‌ ఏక్‌ ప్రయాస్‌’ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీటిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సర్వే వివరాలను వెల్లడించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అపరాజితా సింగ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని.. దీనిపై స్టే ఇవ్వాలని వాదించారు.

బిహార్‌లో 63 శాతం బీసీలే.. కులగణన వెల్లడి

దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాన్ని అడ్డుకోలేం. అది తప్పిదమే అవుతుంది. ఒకవేళ డేటాకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. దాన్ని పరిశీలనలోకి తీసుకుంటాం. ఇటువంటి సర్వే చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, తదితర అంశాలను పరిశీలిస్తాం’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించి తదుపరి సమాచారాన్ని ప్రకటించకుండా యథాతథ స్థితిని పిటిషనర్‌ కోరినప్పటికీ.. సుప్రీం ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో పిటిషనర్ల సవాలుపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని