DMK: ఆ మూడు బిల్లుల పేర్లను ఇంగ్లిష్‌లోకి మార్చండి: డీఎంకే డిమాండ్‌

కేంద్రం తీసుకొచ్చిన మూడు కీలక బిల్లుల పేర్లను హిందీలో కాకుండా ఇంగ్లీష్‌లోకి మార్చాలని డీఎంకే డిమాండ్‌ చేసింది. ఈ మేరకు  పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తోపాటు, ఆపార్టీ ఎంపీ విల్సన్‌ కేంద్రం చర్యలను తప్పుబట్టారు. 

Published : 12 Aug 2023 18:27 IST

చెన్నై: వలస పాలన గుర్తులను చెరిపేస్తున్నామంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులపై తమిళనాడులో (Tamil Nadu) అధికారంలో ఉన్న డీఎంకే (DMK) అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటి పేర్లను ఆంగ్లంలోకి మార్చాలని డిమాండ్‌ చేసింది. బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టాల స్థానంలో వరుసగా.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్యా (బీఎస్‌) పేరుతో కేంద్రం శుక్రవారం కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై డీఎంకే ఎంపీ విల్సన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజా బిల్లుల ద్వారా దేశంలో హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ‘తప్పనిసరి హిందీని’ అమలు చేయకూడదని అన్నారు. ఏదైనా విషయాన్ని ప్రజలపై బలవంతగా రుద్దడం రాజ్యాంగ విరుద్ధమని విల్సన్‌ తెలిపారు.

పార్లమెంట్‌ ఉభయసభలు శుక్రవారం నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో విల్సన్‌ ఇవాళ దిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘  భారత దేశంలో రకరకాల భాషలు మాట్లాడేవారున్నారు. వాళ్లందరికీ ఇంగ్లీష్‌ కొద్దోగొప్పో అర్థమవుతుంది.  కానీ, కేంద్రం తాజాగా తీసుకొచ్చిన మూడు బిల్లులూ.. హిందీలో ఉన్నాయి. అవి ఎవరికీ అర్థం కావు. వాటిని పలకడం కూడా కష్టమే. ఇది కేవలం హిందీని బలవంతంగా చొప్పించేందుకు చేస్తున్న ప్రయత్నమే. భాజపా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోంది.’’ అని అన్నారు. 

ఇదే అంశంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా స్పందించారు. అధికార భాజపా భాషా సామ్రాజ్యవాదం పేరుతో ‘భారతీయ వైవిధ్యం’ అనే పదానికి నిర్వచనాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని ట్విటర్‌ వేదికగా విమర్శించారు. ఇకపై ‘తమిళం’ అనే పదాన్ని కూడా ఉచ్చరించే నైతిక హక్కు భాజపాకిగానీ, ప్రధాని నరేంద్ర మోదీకి గానీ లేదన్నారు. ‘ ఏ భాష అయినా హిందీ తర్వాతే అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. అన్ని భాషలకు హిందీని ప్రత్యామ్నాయంగా మార్చాలన్న భాజపా కుటిల నిర్ణయాన్ని కచ్చితంగా అడ్డుకుంటాం’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనికి ‘Stop Hindi’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జోడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని