IN PICS: 5 రోజుల్లోనే  3డీ ప్రింటెడ్‌ ఇల్లు

దేశంలోనే తొలిసారి ఐఐటీ మద్రాస్‌లో 3డీ ప్రింటింగ్‌ పద్ధతిలో నిర్మించిన ఇల్లు ఎంతగానో ఆకట్టుకుంటోంది. 600 చదరపు అడుగులతో నిర్మించిన ....

Published : 28 Apr 2021 20:13 IST

చెన్నై: దేశంలోనే తొలిసారి ఐఐటీ మద్రాస్‌లో 3డీ ప్రింటింగ్‌ పద్ధతిలో నిర్మించిన ఇల్లు ఎంతగానో ఆకట్టుకుంటోంది. 600 చదరపు అడుగులతో నిర్మించిన ఈ 3డీ ప్రింటర్‌ కాంక్రీట్‌ గృహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృశ్యమాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థులు ఈ నమూనాను రూపొందించగా.. చెన్నైకు చెందిన త్వస్థ మ్యానుఫ్యాక్చరింగ్‌ సొల్యూషన్స్‌ ఈ గృహాన్ని కేవలం 5 రోజుల్లోనే నిర్మించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. 2022 నాటికి అందరికీ ఇళ్ల పథకం కింద కోటి గృహాలను గడువులోగా అందుకోవడం పెద్ద సవాల్‌ అని, అయితే 5 రోజుల్లోనే ఇళ్లు నిర్మించే ఆలోచనతో ఇది సులభతరం అవుతుందని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే ఇల్లు నిర్మించే ఇలాంటి పరిష్కారాలు భారత్‌కు కచ్చితంగా అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి గతంలోనే తనకు త్వస్థ సంస్థ నిర్వాహకులు ప్రజెంటేషన్‌ ఇచ్చారని, అంతా ఆత్మనిర్భరేనని చెప్పారన్నారు. ఆలోచన మొదలుకొని ఇంటిని అమర్చడంతో పాటు డిజైన్‌ కూడా పూర్తిగా మేడిన్‌ ఇండియానే అన్నారు. భారత్‌లో ఇలాంటివి చాలా అవసరమని కేంద్రమంత్రి తెలిపారు. సంప్రదాయ గృహాలకైతే సమయం, మెటీరియల్‌, లాజిస్టిక్స్‌, మెటీరియల్‌ రవాణా ఇలా.. అనేకం అవసరమవుతాయని చెప్పారు. కానీ ఈ టెక్నాలజీతో కేవలం ఐదు రోజుల్లోనే వేర్వేరు చోట్ల ఇళ్లను పూర్తి చేయవచ్చని తెలిపారు.

ఐఐటీ మద్రాస్‌లో 2016 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులు త్వస్థ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ వ్య‌వ‌స్థాప‌కులు ఆదిత్య వీఎస్ (సీఈఓ), విద్యాశంకర్ సీ (సీఓఓ), పరివర్తన్ రెడ్డి (సీటీఓ) ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వాడటం వల్ల గృహ నిర్మాణ వ్యయంతో పాటు సమయాన్ని కూడా ఎంతగానో ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని