One Nation, One Election: ‘ప్రత్యేకం’ ముగిసిన మరునాడే.. ‘జమిలి’ కమిటీ తొలి భేటీ

One Nation, One Election: జమిలి ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ తొలి భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని కమిటీ ఛైర్మన్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తాజాగా వెల్లడించారు.

Published : 16 Sep 2023 14:21 IST

దిల్లీ: ‘ఒకే దేశం - ఒకే ఎన్నికల (One Nation, One Election)’ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తొలి సమావేశం అతి త్వరలో జరగనుంది. సెప్టెంబరు 23న ‘జమిలి’ కమిటీ భేటీ కానుందని రామ్‌నాథ్ కోవింద్‌ శనివారం వెల్లడించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ముగిసే మరునాడే ఈ సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒకే దేశం - ఒకే ఎన్నికల (One Nation, One Election) కమిటీకి కోవింద్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.  ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించారు. జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఎదురయ్యే సవాళ్లు, ఈ ఎన్నికల వల్ల ప్రయోజనాలను, ఇతర సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.

ఖలిస్థానీ చిచ్చు.. భారత్‌-కెనడా వాణిజ్య చర్చలకు బ్రేక్‌

కాగా.. సెప్టెంబరు 18-22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు పూర్తయిన మరుసటి రోజే జమిలి కమిటీ భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన కేంద్రం ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసింది. ఈ నెల 19న కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18వ తేదీన 75ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని