India-Canada: ఖలిస్థానీ చిచ్చు.. భారత్‌-కెనడా వాణిజ్య చర్చలకు బ్రేక్‌

India-Canada: భారత్‌, కెనడా మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ఖలిస్థానీ వివాదంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Updated : 16 Sep 2023 11:07 IST

దిల్లీ: ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్‌ - కెనడా (India - canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇవి మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)పై చర్చలకు బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునఃప్రారంభిస్తామని భారత్‌ స్పష్టంగా చెప్పింది.

‘‘కెనడాలో చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీ వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందువల్ల ఆ రాజకీయ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు వాణిజ్య (FTA) చర్చలను నిలిపివేస్తున్నాం. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. సమస్య పరిష్కారమైన తర్వాత చర్చలను మళ్లీ ప్రారంభిస్తాం’’ అని భారత సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అటు కేంద్ర వాణిజ్య శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

వాస్తవానికి జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. వచ్చే నెలలో ఆ చర్చలను తిరిగి ప్రారంభించాల్సి ఉండగా.. ఇప్పుడు మరోసారి వాటికి బ్రేక్ పడింది. అటు కెనడా కూడా ఈ చర్చలపై స్పందించింది. భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని ఆ దేశ వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారు. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం కెనడా వెల్లడించలేదు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.

ఉగ్రపుట్టగా పీర్‌ పంజాల్‌: ముష్కర మూకల స్థావరాలు ఈ పర్వత శ్రేణులే

కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడోతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. భారత్‌ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. భారత్‌-కెనడా దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి.

భారత్‌, కెనడా మధ్య ఇప్పటివరకు ఆరు సార్లు వాణిజ్య చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య అత్యధిక వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించడం లేదా తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించేలా వాణిజ్య నిబంధనలను సరళీకరించడం ఈ చర్చల ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంతో టెక్స్‌టైల్‌, లెదర్‌ వంటి ఉత్పత్తులపై సుంకాలను తొలగించుకోవడంతో పాటు వీసా నిబంధనలను కూడా సులభతరం చేసుకోవచ్చని భారత్‌ భావిస్తోంది. అటు భారత్‌ నుంచి డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవచ్చని కెనడా ఈ చర్చలు ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని