Rajya Sabha: రాజ్యసభ సమావేశాలు.. అన్ని రోజులూ హాజరైన ఒకేఒక్కడు..

రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యుల సంఖ్యను ఎగువ సభ సచివాలయం తొలిసారి లెక్కించింది.

Published : 05 Oct 2021 10:57 IST

 సమావేశాలకు ప్రతిరోజూ 78% మంది హాజరు

ఈనాడు, దిల్లీ: రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యుల సంఖ్యను ఎగువ సభ సచివాలయం తొలిసారి లెక్కించింది. సమావేశాలకు హాజరవుతున్న సభ్యుల తీరును తెలుసుకోవడానికి గణాంకాలు రూపొందించాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గత ఏడు సమావేశాల పనితీరును అధికారులు గణించారు. దీని ప్రకారం సభకు ప్రతిరోజూ 78% మంది హాజరవుతున్నట్లు తేలింది. అందులో 30% మంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా వస్తున్నట్లు వెల్లడైంది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో జరిగిన 248వ సమావేశం నుంచి 254వ సమావేశం వరకు జరిగిన 138 సిట్టింగ్‌ల లెక్కలను ఇప్పుడు విశ్లేషించారు. సమావేశాలకు హాజరయ్యేటప్పుడు మంత్రులు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, సభాపక్షనాయకుడు, ప్రతిపక్షనాయకుడు హాజరు పట్టికలో సంతకం చేయాల్సిన అవసరం ఉండదు. మిగిలిన 225 మందీ రోజువారీగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. గత ఏడు సమావేశాల్లో తాజాగా ముగిసిన 254వ సమావేశానికి గరిష్ఠంగా 82.57% మంది సభ్యులు రోజూ హాజరయ్యారు.

గత ఏడు సమావేశాలకు 29.14% మంది సభ్యులు ప్రతిరోజూ హాజరయ్యారు. కేవలం 1.90% మంది విభిన్న కారణాల వల్ల ఒక్క రోజూ హాజరవలేదు. సభనుంచి ముందస్తుగా సెలవు తీసుకున్నారు. గత మూడు సమావేశాలు కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్నప్పటికీ సభ్యుల హాజరుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. 251వ సమావేశాల సమయంలో 34 మంది సభ్యులు (15.27%) మంది ప్రతిరోజూ హాజరుకాగా, 254వ సమావేశాల నాటికి ఆ సంఖ్య 98 (46%)కి చేరింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన 75 ఏళ్ల సభ్యుడు ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణ్యం 7 సమావేశాల్లో 138 రోజూలూ సభకు హాజరైన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీజీ వెంకటేష్, మరో అయిదుగురు సభ్యులు ఆరు సమావేశాలకు సంపూర్ణంగా హాజరయ్యారు. ఏపీకే చెందిన కనకమేడల రవీంద్రకుమార్, మరో ఏడుగురు 5 సమావేశాలకు పూర్తిగా వచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని