China: పిల్లల్ని కనమంటే కనరే!..ముగ్గురు పిల్లల విధానానికి స్పందన కరవు

ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా గుర్తింపు ఉన్న చైనా ఇపుడు జననాల వృద్ధి రేటు బాగా క్షీణించడంతో

Updated : 06 Jan 2022 16:39 IST

జననాల రేటు క్షీణతతో చైనా ఆందోళన
60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు 26.40 కోట్లు 

బీజింగ్‌: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా గుర్తింపు ఉన్న చైనా ఇపుడు జననాల వృద్ధి రేటు బాగా క్షీణించడంతో సందిగ్ధంలో పడింది. ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కనేందుకు సైతం అనుమతిస్తూ కొత్త విధానం తీసుకువచ్చినా ఫలితాలు ఆశించినంతగా లేవు. దేశంలోని పది ప్రావిన్సు స్థాయి ప్రాంతాల్లో 2020 గణాంకాల ప్రకారం జననాల రేటు ఒక శాతానికి లోపునకు పడిపోయింది. దేశంలో జననాల వృద్ధి రేటు గణనీయంగా తగ్గి, జనాభాపరంగా ఏర్పడిన సంక్షోభానికి విధానాల రూపకర్తలే కారకులని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో ముగ్గురు పిల్లల విధానానికి చైనా పచ్చజెండా ఊపింది. దశాబ్దాల తరబడి ఏక సంతాన నిబంధన కొనసాగిన చైనా విధానాల్లో ఇది భారీ మార్పునకు సంకేతం. ఇద్దరు పిల్లలు కనేందుకు అనుమతిస్తూ 2016లో చైనా చట్టం తీసుకువచ్చింది. పదేళ్లకోమారు జరిగే జనాభా గణనలో వృద్ధి రేటు పరంగా ప్రమాద సంకేతాలు కనిపించడంతో ఇపుడు ఆ నిర్ణయం కూడా మార్చుకొని, ప్రతి జంటా ముగ్గుర్ని కనాలని అంటోంది చైనా. డ్రాగన్‌ దేశ జనాభా ప్రస్తుతం 141.2 కోట్లు ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. జనాభాలో 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు 26.40 కోట్లు (18.7%) ఉన్నారు. 

కొవిడ్‌-19 ఒక కారణం..! 
ముగ్గురు పిల్లల విధానంలోకి మారాక చైనాలోని 20కు పైగా ప్రొవిన్షియల్‌ రీజియన్లలో సమూల మార్పులు తీసుకొచ్చి, పిల్లలను కనే జంటలకు పలు ప్రోత్సాహకాలు కల్పించారు. దంపతులకు పలువిధాల సెలవులు మంజూరు చేయడం పెరిగింది. అత్యధిక జనాభా గల ప్రావిన్సుల్లో ఒకటైన హనన్‌లో 1978 నుంచి మొదటిసారి జననాలు పది లక్షలకు లోపు పడిపోయాయి. 2020 గణాంకాల ప్రకారం చైనా జననాల రేటు 8.52 (వెయ్యిమందికి). గత 43 ఏళ్లలో ఇది అత్యల్పమని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది. ‘జననాల వృద్ధి రేటు పడిపోవడానికి కొవిడ్‌ -19 ఓ కారణం’ అని చైనాలోని రెన్‌మిన్‌ విశ్వవిద్యాలయ జనాభా, అభివృద్ధి అధ్యయనాల కేంద్రం ప్రతినిధి సాంగ్‌ జియాన్‌ తెలిపారు. దంపతులు ఎక్కువమంది పిల్లలను కనేందుకు కొన్ని కచ్చితమైన, వ్యవస్థాగత విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలోని ఈ పరిస్థితులపై కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 1990 తర్వాత పుట్టినవాళ్లలో చాలామంది పెళ్లంటేనే విముఖత చూపుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. దేశంలో ఎక్కువమంది గృహవసతి లేక పడుతున్న ఇబ్బందులను కారణంగా చూపుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు