ఉదయం పూజ.. మధ్యాహ్నం భేటీ

భారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28న జరిగే వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు.

Published : 27 May 2023 05:55 IST

లోక్‌సభలో ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభ షెడ్యూల్‌ జారీ

దిల్లీ: భారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28న జరిగే వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా తెల్లవారుజామునే పాత పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రతువులో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సహా పలువురు సీనియర్‌ మంత్రులు పాల్గొననున్నారు. పూజ అనంతరం వీరంతా లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్‌ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. అనంతరం నూతన పార్లమెంట్‌ ఆవరణలోనూ పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 గంటలలోపే పూర్తి కానున్నాయి.

* అనంతరం మధ్యాహ్నం జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. లోక్‌సభ ఛాంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా అతిథులు హాజరుకానున్నారు. ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడతారు.  పార్లమెంట్‌ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు. తర్వాత లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు. స్పీకర్‌ ప్రసంగం అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మాట్లాడానికి సమయాన్ని కేటయించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడతారు.

రూ.75 స్మారక నాణెం విడుదల!

ఈ నెల 28న ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.75 విలువైన స్మారక నాణెంను విడుదల చేయనుంది. ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన అధికారిక  సమాచారం మేరకు నాణెం 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల బరువు ఉండనుంది. నాణేనికి ఒకవైపున మూడు సింహాల గుర్తు, మధ్యలో దేవనాగరి లిపిలో ‘భారత్‌’ అని.. ఇంగ్లిష్‌లో ‘ఇండియా’ అని ఉంటాయి. అలాగే రూపాయి గుర్తు ‘ Rs ’, నాణెం విలువను సూచిస్తూ ‘75’ సంఖ్య అడుగు భాగాన ముద్రిస్తారు. నాణెం రెండో వైపున పార్లమెంటు భవనం బొమ్మ, సంవత్సరాన్ని సూచిస్తూ ‘2023’ను ముద్రిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు