ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్‌-3

చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు ఇస్రో గురువారం ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు.

Published : 07 Jul 2023 04:53 IST

ఆగస్టు 23న జాబిల్లిపైకి రోవర్‌
వెల్లడించిన ఇస్రో అధిపతి

ఈనాడు - బెంగళూరు, సూళ్లూరుపేట - న్యూస్‌టుడే: చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు ఇస్రో గురువారం ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 13న ప్రయోగం చేపట్టాలని ముందుగా భావించినా లాంచ్‌ విండో అనుకూలతను పరిశీలించి 14వ తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగ సమయాన్ని ఖరారు చేశారు. బుధవారం ఎల్‌వీఎం-3పీ4 వాహక నౌకతో చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని అనుసంధానించిన శాస్త్రవేత్తలు.. గురువారం వాహకనౌకను రెండో ప్రయోగ వేదికపైకి తీసుకొచ్చారు.

ఆ రోజే ల్యాండింగ్‌

పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రయాన్‌-3 రోవర్‌ జాబిలిపై పాదం మోపే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. గురువారం బెంగళూరులో నిర్వహించిన ‘జి-20 స్పేస్‌ ఎకానమీ లీడర్స్‌ మీట్‌’లో ఆయన ఈ మేరకు వెల్లడించారు. గత తొమ్మిదేళ్లలో భారత అంతరిక్ష రంగం విప్లవాత్మక సంస్కరణలతో దూసుకెళ్లిందని ఈ సదస్సులో మాట్లాడుతూ అంతరిక్షశాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈ రంగంలో 140కి పైగా అంకురాలు ఏర్పాటు అయ్యాయన్నారు. సదస్సులో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌, అంతరిక్ష శాఖ కార్యదర్శి అమితాబ్‌ కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని