రైలు పట్టాల కింద గుంత.. బాలుడి చొరవతో తప్పిన ప్రమాదం

పదేళ్ల బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించాడు. వందల మంది ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Published : 24 Sep 2023 06:47 IST

అవార్డుకు సిఫార్సు చేస్తామన్న అధికారులు

పదేళ్ల బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించాడు. వందల మంది ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ముర్సెలీమ్‌ అనే పదేళ్ల ఈ బాలుడు పశ్చిమబెంగాల్‌లోని హరిశ్చంద్రపుర్‌ రెండో బ్లాక్‌లోని కరియాలి గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కుంటలో చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు అక్కడికి చెంతనే రైలు పట్టాల కింద పెద్ద గుంత ఉండటం గమనించాడు. అంతలోనే అదే పట్టాలపై అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకువస్తోంది. అప్రమత్తమైన ముర్సెలీమ్ వేగంగా పట్టాల వద్దకు పరుగెత్తాడు. తన ఒంటిపై ఉన్న ఎర్ర టీషర్టు ఊపుతున్న బాలుడిని గమనించిన లోకోపైలట్‌ వెంటనే రైలును నిలిపివేశారు. ఇంజిన్‌ దిగి, పట్టాల పరిస్థితి చూసి బాలుడిని అభినందించారు. వర్షాలకు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోయినట్లు ఆయన ఇచ్చిన సమాచారంతో వివిధ విభాగాల రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంధ్రాన్ని పూడ్చివేశారు. గంట తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది. ముర్సెలీమ్‌ పేరును అవార్డు కోసం సిఫార్సు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని