ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు నోటీసు

ఆప్‌ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు భాజపా యత్నిస్తోందన్న ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌కు దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం నోటీసు అందజేశారు.

Published : 04 Feb 2024 06:33 IST

5 గంటల హైడ్రామా తర్వాత అందజేసిన పోలీసులు

దిల్లీ: ఆప్‌ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు భాజపా యత్నిస్తోందన్న ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌కు దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం నోటీసు అందజేశారు. ఆరోపణలకు సంబంధించి మూడ్రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి నివాసం వద్ద దాదాపు ఐదు గంటలు హైడ్రామా చోటుచేసుకుంది. ‘‘మేం ఆయన(కేజ్రీవాల్‌)కు నోటీసు అందజేశాం. ఆయన మూడ్రోజుల్లోగా లిఖితపూర్వకంగా బదులివ్వాలి’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. భాజపా నేతలు సంప్రదింపులు జరిపిన ఆప్‌ శాసనసభ్యుల పేర్లను వెల్లడించాల్సిందిగా కూడా క్రైమ్‌ బ్రాంచ్‌ సిబ్బంది కేజ్రీవాల్‌ను కోరారు. అదే సమయంలో నోటీసును ముఖ్యమంత్రి నివాసంలోని అధికారులకు అందజేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ముఖ్యమంత్రి నివాసానికి క్రైమ్‌బ్రాంచ్‌ అధికారులు వెళ్లగా అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. ఏ చట్టం ప్రకారం ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా నోటీసు అందజేయాలని భావిస్తున్నారని ఆప్‌ నేతలు పోలీసులను నిలదీశారు.

సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించడంలేదు: ఈడీ

దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి వ్యవహారానికి సంబంధించి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేస్తున్నప్పటికీ ఆయన విచారణకు హాజరు కావడం లేదని పేర్కొంటూ న్యాయస్థానంలో ఈడీ ఫిర్యాదు దాఖలుచేసింది. ఈ మేరకు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దివ్య మల్హోత్ర ఎదుట ఫిర్యాదు దాఖలు చేయగా.. తదుపరి విచారణ ఈ నెల ఏడుకు వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని