నామినేషన్ల పర్వం ప్రారంభం

సార్వత్రిక సమరంలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. తమిళనాడుసహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరఫున బుధవారం ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసింది.

Updated : 21 Mar 2024 06:25 IST

తొలి విడతకు నోటిఫికేషన్‌ జారీ

దిల్లీ: సార్వత్రిక సమరంలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. తమిళనాడుసహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరఫున బుధవారం ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది.

  • తొలి విడతలోనే తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. దీంతో ఆ రాష్ట్రంలో హడావుడి మొదలైంది. ఇప్పటికే పొత్తులను కుదుర్చుకున్న పార్టీలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈటానగర్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసింది. ఇక్కడ 60 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను భాజపా ఇప్పటికే ప్రకటించింది. అరుణాచల్‌ వెస్ట్‌ నుంచి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బరిలోకి దిగుతున్నారు. 2019లో 2 లోక్‌సభ సీట్లను భాజపా గెలుచుకుంది. అసెంబ్లీలో 41 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. జేడీయూ 7, ఎన్‌పీపీ 5 సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌ 4, పీపీఏ 1 సీటు సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు.
  • అస్సాంలోని కాజీరంగా, సోనిత్‌పుర్‌, లఖింపుర్‌, దిబ్రూగఢ్‌, జొర్హాట్‌ నియోజకవర్గాల్లో తొలి విడతలో పోలింగ్‌ జరగనుంది. తొలి విడతలోని ప్రముఖుల్లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష ఉప నేత గౌరవ్‌ గొగొయ్‌ తదితరులున్నారు.
  • పుదుచ్చేరిలోని లోక్‌సభ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారి కులోత్తుగన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.
  • జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌-కథువా లోక్‌సభ స్థానానికి తొలి విడతలోనే ఎన్నిక జరగనుంది. ఈ సీటుకు ఇప్పటివరకూ భాజపా, గులాం నబీ ఆజాద్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని