Tamil Nadu: ఏడాది వర్షపాతం ఒక్కరోజులోనే..: సీఎం స్టాలిన్‌

తమిళనాడులోని తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఏడాది వర్షపాతం.. ఒక్కరోజులోనే నమోదైందని సీఎం ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు.

Updated : 19 Dec 2023 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడును భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తాయి. ముఖ్యంగా దక్షిణాది జిల్లాలైన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారిల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. తిరునెల్వేలి, తూత్తుకుడిల్లో ఏడాది వర్షపాతం.. ఒక్కరోజులోనే నమోదైందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) వెల్లడించారు. వరదలతో ఈ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చించేందుకుగానూ దిల్లీకి వెళ్లిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తూత్తుకుడిలో సహాయక చర్యలను బుధవారం స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.

‘‘డిసెంబరు 17, 18 తేదీల్లో వాతావరణశాఖ అంచనా వేసిన దానికంటే భారీ వర్షాలు కురిశాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో గత 47-60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసింది. ఒక్క కాయల్పట్టినంలో 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 13 వేల మందిని శిబిరాలకు తరలించాం. హెలికాప్టర్ల ద్వారా నిర్వాసితులకు ఆహారం పంపిణీ చేస్తున్నాం. సైన్యం సాయం కూడా కోరాం’ అని సీఎం స్టాలిన్‌ వివరించారు.

తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

ఇటీవల చెన్నై సహా నాలుగు జిల్లాలను మిగ్‌జాం తుపాను కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ ‘‘తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు శాశ్వత సాయంగా రూ.12,059 కోట్లు, మధ్యంతర సాయంగా మరో రూ.7,033 కోట్లు కోరాం. కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా నాలుగు జిల్లాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందించాం. కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు అందిస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టగలం’’ అని తెలిపారు. ఈ విషయంతోపాటు దక్షిణాది జిల్లాల్లో జరిగిన వరద నష్టాలను ఆయన ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని