Karnataka: ఉద్యోగులకు ‘ఎన్నికల’ బొనాంజా.. సమ్మె గండం గట్టెక్కిన బొమ్మై సర్కారు

శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటక (Karnataka) సర్కారు సమ్మె (Strike) గండం నుంచి గట్టెక్కింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన బొనాంజా ప్రకటించింది.

Published : 02 Mar 2023 01:16 IST

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు కర్ణాటక (Karnataka) సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మూల వేతనాన్ని 17శాతం పెంచుతూ బుధవారం కీలక ప్రకటన చేసింది. దీంతో పాటు పింఛను విధానంపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఉద్యోగులు తమ సమ్మెను విరమించారు.

కర్ణాటక (Karnataka) చరిత్రలో దాదాపు 25 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె (strike) బాట పట్టిన విషయం తెలిసిందే. బేసిక్‌ శాలరీని 40శాతం పెంచడంతో పాటు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతాలను సవరించాలని, పాత పింఛను విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం ఉద్యోగులంతా సమ్మె చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు (Government employees) ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే, మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) సర్కారుకు ఈ సమ్మె ఓ గండంలా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దిగొచ్చారు. గంటల వ్యవధిలోనే వేతన పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఈ పెంపుతో ఉద్యోగులకు కాస్త ఉపశమనం కల్పించి సమ్మె గండం నుంచి గట్టెక్కారు.

ఈ సందర్భంగా బొమ్మై (Basavaraj Bommai) మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగులందరి వేతనాన్ని 17శాతం పెంచుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఇక 7వ వేతన సవరణ సంఘం అమలు గురించి కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించా. ఇక నూతన పింఛను విధానాన్ని అధ్యయనం చేసేందుకు అదనపు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నాం. ఆ కమిటీ రెండు నెలల్లో తమ నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత సమస్య కూడా పరిష్కారమవుతుంది. అందువల్ల ఉద్యోగులు సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలి’’ అని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటనతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు సమ్మె (Strike) విరమించాయి. ఉద్యోగులంతా తక్షణమే తిరిగి విధుల్లో చేరాలని చెప్పినట్లు కర్ణాటక (Karnataka) రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.ఎస్‌.షడాక్షరి మీడియాకు తెలిపారు.

కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగియనుంది. అంతకంటే ముందే ఏప్రిల్‌లో ఎన్నికలు (Assembly elections) జరిగే అవకాశాలున్నాయి. మార్చి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని