Akhilesh Yadav: ‘జనాభాలో భారత్‌ నం.1.. ఇది ప్రభుత్వ వైఫల్యమే..!’

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించిన విషయం తెలిసిందే. అయితే, ఇది ఆందోళనకర విషయమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Published : 20 Apr 2023 19:19 IST

లఖ్‌నవూ: ఐరాస (UN) వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం (Most Populous Nation)గా భారత్‌ అవతరించిన విషయం తెలిసిందే. మొత్తం 142.86 కోట్ల జనాభాతో చైనా (China)ను దాటేసింది. అయితే, దేశంలో అధిక జనాభా ప్రభుత్వ వైఫల్యమేనని సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) విమర్శించారు. ‘ఇది ఆందోళనకర వార్త. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం’ అని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరణలనూ ఆయన పొందుపరిచారు.

‘పేదరికం, నిరుద్యోగం కారణంగా.. తమకు పనిలో సాయంగా ఉంటారని, లేదా సంపాదించి పెడతారని భావిస్తూ ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. వైద్యసదుపాయాల కొరత కారణంగా శిశుమరణాల భయం కూడా అధిక సంతానానికి దారితీస్తోంది. అంతేకాకుండా గర్భనిరోధక పద్ధతులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. సరైన చదువు లేకపోవడం వల్ల అధిక జనాభా అనర్థాలను అర్థం చేసుకోకపోవడం కూడా జనాభా పెరుగుదలకు మరో కారణం’ అని అఖిలేశ్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. 2022 నాటికి భారత్‌ జనాభా 141.2 కోట్లు కాగా చైనా జనాభా 142.6 కోట్లుగా ఉండేది. అయితే, కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతోంది. భారత్‌లోనూ కొంత మేరకు క్షీణత కనిపిస్తోంది. అయితే చైనాతో పోలిస్తే తక్కువే. దీంతో మన దేశం అగ్రస్థానానికి చేరింది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉన్నారు. 2023 ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం ఆధారంగా ఈ అంచనాలు రూపొందించినట్లు ఐరాస తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని