రామ మందిరం విరాళాలు.. అత్యధికంగా సమకూర్చింది ఇతడే!

Ayodhya Ram Temple: రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి, ఆయన కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated : 23 Jan 2024 09:23 IST

Ayodhya Ram Temple | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమైంది. బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ బృహత్ కార్యం సాకారం కావడానికి కలిసిన చేతులు ఎన్నో! దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు సమకూర్చారు. ఇందులో రోజువారీ కూలీలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఉన్నారు.

ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి, ఆయన కుటుంబం ముందువరుసలో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్‌లో బంగారం 10 గ్రాములు రూ.68వేలుగా ఉంది. ఆ లెక్కన రామాలయానికి లాఖి కుటుంబం రూ.68 కోట్లు విరాళంగా ఇచ్చినట్లయ్యింది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది.

IN PICS: అంగరంగ వైభవంగా అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్‌ బాపూ రూ.11.3 కోట్లు రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌లో నివసిస్తున్న రామ భక్తులు మరో రూ.8 కోట్లు సమకూర్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా రూ.11 కోట్లు విరాళమిచ్చారు. యూపీలో ఒక వ్యక్తి మందిరం కోసం రూ.కోటి ఇవ్వాలని నిర్ణయించుకుని అందుకుగాను 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడట. అయినా 15 లక్షలు తక్కువవడంతో ఆ మొత్తాన్ని అప్పు తెచ్చి అనుకున్నట్లుగా రూ.కోటి జమ చేసి ఇచ్చాడట. దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారని విశ్వహిందూ పరిషత్‌ లెక్కలు చెబుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని