మాతో పెట్టుకోవద్దు.. ‘హద్దు’లు దాటి బదులిస్తాం: రాజ్‌నాథ్‌

Rajnath Singh warns neighbour: భారత్‌తో పెట్టుకోవద్దని పొరుగుదేశానికి రాజ్‌నాథ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇది మునుపటి భారత్‌ కాదని గుర్తుంచుకోవాలన్నారు.

Published : 01 Jul 2023 22:39 IST

కాంకేర్‌ (ఛత్తీస్‌గఢ్‌): భారత్‌కు హాని చేయాలని ఎవరైనా చూస్తే గట్టిగా బదులిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అన్నారు. ఇది ఒకప్పటి ఇండియా కాదంటూ హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరించి ఉంటే ఈ పాటికే వామపక్ష తీవ్రవాదాన్ని దేశంలో తుడిచిపెట్టేసేవాళ్లమని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో శనివారం రాజ్‌నాథ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉరీ, పుల్వామా ఉగ్రదాడి ఘటనలకు భారత్‌ బదులిచ్చిన తీరును ప్రస్తావించారు.

‘‘పాకిస్థాన్‌ నుంచి కొందరు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారు. మన జవాన్లపై దాడి చేశారు. కొందరు జవాన్లు అమరులయ్యారు. అప్పట్లో నేను హోంమంత్రిగా ఉన్నా. దిల్లీలో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. కేవలం పదే నిమిషాల్లో నిర్ణయం తీసుకున్నారు. మన ఆర్మీ జవాన్లు వెంటనే పొరుగుదేశంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను హతమార్చారు’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘‘పొరుగు దేశానికి ఒక్కటే చెప్పదలచుకున్నా. భారత్‌తో పెట్టుకోవద్దు. మమ్మల్ని రెచ్చగొట్టాలని చూడొద్దు. కేవలం సరిహద్దుల్లోపల నుంచే కాదు.. అవసరమైతే సరిహద్దులు దాటి చంపగలం. ఇది ఒకప్పటి భారత్‌ కాదు.. ఇప్పుడు పూర్తిగా మారింది’’ అంటూ రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. అయితే, పొరుగుదేశం పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.

‘‘ఛత్తీస్‌గఢ్‌ సుదీర్ఘకాలంగా వామపక్ష తీవ్రవాదంతో ఇబ్బంది పడుతోంది. మోదీ హయాంలో తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన చర్యల కారణంగా వారి ప్రాబల్యం చాలా వరకు తగ్గింది. దేశవ్యాప్తంగా 10-12 జిల్లాల్లో మాత్రమే ఉంది. అందులో కొన్ని ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నాయి’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్‌ ప్రభుత్వ హయాంలో మత మార్పిడులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా గిరిజన ప్రాబల్యం కలిగిన బస్తర్‌ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉందన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. దీనిపై కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయం తీసుకోవాలన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రూ.90వేల కోట్లతో మోదీ సర్కారు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా ప్రజలకు గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని