Swiss bank: కేంద్ర ప్రభుత్వం చేతికి స్విస్‌ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా

స్విస్‌ బ్యాంకు (Swiss bank) ఖాతాదారుల ఐదో జాబితా విడుదలైంది. వాటిలో భారతీయ (India) ఖాతాదారులు, సంస్థలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంది. 

Published : 09 Oct 2023 16:58 IST

దిల్లీ: స్విస్‌ బ్యాంకులో (Swiss bank) ఖాతా తెరిచిన భారతీయులు, భారతీయ సంస్థల జాబితా కేంద్ర ప్రభుత్వానికి అందింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఐదో జాబితాను స్విట్జర్లాండ్ (Switzerland) అందజేసింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది వరకు నాలుగు జాబితాలను ఆ దేశం పంపించింది. 

సంక్షేమ పథకాలే ఆయుధంగా కాంగ్రెస్‌.. అభివృద్ధిపైనే భాజపా ఆశలు!

తాజా జాబితాలో మొత్తం 104 దేశాలకు చెందిన 36 లక్షల ఖాతా వివరాలు ఉన్నాయి. స్విస్‌ పంచుకున్న వివరాల్లో ఖాతాదారుల పేరు, అడ్రెస్‌, ఖాతా సంఖ్య, ఆర్థిక సమాచారం, నివాసం, ట్యాక్స్‌ నంబర్‌ తదితర ముఖ్యమైన విషయాలు ఉన్నట్లు తెలిసింది. అలాగే ఆర్థిక సంస్థల పేరు, వాటి ఖాతాలోని నిల్వలు, మూలధన ఆదాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ ఖాతాల్లో ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. సమాచార మార్పిడిలో గోప్యత నిబంధనను పాటిస్తూ, తదుపరి పరిశోధనలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు. 

ఈ వివరాల ఆధారంగా అధికారులు మనీలాండరింగ్‌, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ, పన్ను ఎగవేతలు, ఇతర నేరాల విచారణ చేపట్టనున్నారు. తాజాగా అందిన ఖాతాల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీ చేయనున్నారు. ట్యాక్స్‌ రిటర్నులలో ఆ మొత్తాలను పొందుపరిచారా? లేదా అనే విషయాన్ని పరిశీలించనున్నారు. 

స్విస్‌ బ్యాంకు ఖాతాదారుల జాబితాను పంచుకోవడంపై స్విస్‌కు చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అటోమేటిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్ఛేంజ్‌ (AEOI) గ్లోబల్ స్టాండర్డ్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా 104 దేశాలతో ఆర్థిక ఖాతాల సమాచారాన్ని పంచుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది కజక్‌స్థాన్‌, మాల్దీవులు, ఒమన్‌ దేశాల సమాచారాన్ని అంతకముందు విడుదల చేసిన 101 దేశాల జాబితాలో కలిపారు.దీంతో ఆర్థిక ఖాతాల సంఖ్య దాదాపు 2 లక్షలు పెరిగింది. తదుపరి జాబితాను 2024 సెప్టెంబరులో విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని