India: పాలస్తీనాకు భారత్‌ మానవతా సాయం.. 6.5 టన్నుల సామగ్రితో బయల్దేరిన విమానం

పాలస్తీనాకు (Palestine) భారత్‌ (India) మానవతా సాయాన్ని పంపిస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ట్విటర్‌ (ఎక్స్‌)లో వెల్లడించారు. 

Published : 22 Oct 2023 11:46 IST

Image: Arindam Bagchi

దిల్లీ: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా (Palestine) ప్రజలను ఆదుకునేందుకు భారత్‌ (India) సిద్ధమైంది. విపత్తు సహాయ సామగ్రి, ఔషధాలను ఆదివారం గాజాకు పంపించింది. ‘ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీస్‌, నీటి శుద్ధీకరణ మాత్రలు ఇతర వస్తువులను’ మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ట్విటర్‌లో(ఎక్స్‌)లో పోస్టు పెట్టారు. 

గాజాపై వైమానిక దాడులను మరింత తీవ్రం చేస్తాం: ఇజ్రాయెల్‌

భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్‌ సీ-17 విమానంలో మొత్తం 6.5 టన్నుల సామగ్రి వెళ్తోందని చెప్పారు. ఈ సామగ్రిని తొలుత ఈజిప్టులోని ఈఎల్-అరిష్‌ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. గాజాలో రహదారులన్నీ తీవ్రంగా ధ్వంసం కావడంతో వివిధ దేశాలు పంపించే మానవతా సాయం వేగంగా పాలస్తీనా పౌరులకు చేరడం లేదు. 

మూడు రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు భారత్‌ మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. ‘ఆ ప్రాంతంలో ఉగ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై మా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాం. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశం అనుసరిస్తున్న దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించాం’ అని మోదీ ట్వీట్‌లో (ఎక్స్‌) పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న హమాస్‌ ఉగ్రవాదులు దాడులు జరిపారు. దాంతో ఇజ్రాయెల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌) హమాస్‌ ఉనికే లేకుండా చేసేందుకు గాజాపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో సాధారణ పాలస్తీనా ప్రజలు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హమాస్‌ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో 4,300 పాలస్తీనియన్లు మరణించారు. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలపై ఐడీఎఫ్‌ దాడులు చేయడంతో అత్యధికంగా మరణాలు సంభవించాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని