Vajra Prahar 2022: హిమాచల్‌లో భారత్‌-అమెరికా ప్రత్యేక దళాల విన్యాసాలు అదుర్స్‌‌!

పాకిస్థాన్‌, చైనా వంటి పొరుగు దేశాల నుంచి ముప్పు, ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న వేళ అమెరికాతో రక్షణ బంధాన్ని భారత్ మరింతగా.....

Published : 18 Aug 2022 02:08 IST

దిల్లీ: పాకిస్థాన్‌, చైనా నుంచి ముప్పు, ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న వేళ అమెరికాతో రక్షణ బంధాన్ని భారత్ మరింతగా బలోపేతం చేసుకుంటోంది. ఇరు దేశాల ప్రత్యేక దళాల మధ్య వజ్ర ప్రహార్-2022 (Vajra prahar-2022) పేరిట సమరోత్సాహంతో కొనసాగుతున్న 13వ సంయుక్త విన్యాసాలకు ఈ ఏడాది భారత్‌లోని హిమాచల్‌ప్రదేశ్‌ వేదికగా నిలిచింది. ఈ నెల 8 నుంచి 21 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో ఇరు దేశాల దళాలూ అత్యుత్తమ యుద్ధ రీతులు, వ్యూహాలను పరస్పరం పంచుకొంటున్నాయి.

పొరుగు దేశం చైనా కుయుక్తులు పన్నుతున్న వేళ భారత్‌ -అమెరికా మధ్య సైనికబంధం అంతకంతకూ బలోపేతమవుతోంది. ఇరుదేశాలూ రక్షణపరంగా పరస్పరం సహకరించుకొంటున్నాయి. గత కొన్ని రోజులుగా భారత్‌-అమెరికా దళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా, వజ్ర ప్రహార్‌-2022 పేరిట ఇరుదేశాల ప్రత్యేక దళాలు జరిపిన సంయుక్త విన్యాసాలు హిమాచల్‌ప్రదేశ్‌ బక్లోహ్‌లోని స్పెషల్‌ ఫోర్సెస్‌ ట్రైనీ స్కూల్‌ (ఎస్‌ఎఫ్‌టీఎస్‌)లో సమరశీలంగా కొనసాగుతున్నాయి. ఈ విన్యాసాలు ఒక ఏడాది అమెరికా ఆతిథ్యం ఇస్తే.. మరో ఏడాది భారత్‌లో జరుగుంటాయి. గతేడాది అక్టోబర్‌లో వాషింగ్టన్‌లోని జాయింట్‌ బేస్‌ లూయిస్‌ మక్కార్డ్‌లో నిర్వహించారు.

ఈ విన్యాసాల ద్వారా యుద్ధం, సైనిక కార్యాచరణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు తదితర సమయాల్లో అవలంబించాల్సిన అత్యుత్తమ పద్ధతులు, వ్యూహాలను ఇరుదేశాలు పరస్పరం పంచుకొంటున్నాయి. రెండు దేశాల ప్రత్యేక దళాల మధ్య పరస్పర కార్యాచరణ మెరుగుపడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ, గగనతలం నుంచి నిర్వహించే ఆపరేషన్లు, పర్వత ప్రాంతాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై ఇరుదేశాల దళాలు విన్యాసాలు చేస్తున్నాయి. భారత్‌ అమెరికా మధ్య ద్వైపాకిక్షక రక్షణ సహకారాన్ని పెంపొందించుకొనేందుకు ఇరుదేశాల ప్రత్యేక దళాల మధ్య స్నేహబంధం మరింతగా ఫరిడవిల్లేందుకు ఈ సంయుక్త విన్యాసాలు దోహదం చేయనున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు