Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం లక్ష్యంగా బాంబు బెదిరింపు మెయిల్‌!

బెంగళూరులోని రామేశ్వరం కెఫే పేలుడు ఘటన మరువకముందే కర్ణాటక ప్రభుత్వానికి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది.

Updated : 07 Mar 2024 12:37 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ప్రభుత్వానికి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం షాహిద్‌ ఖాన్‌ అనే వ్యక్తి పేరుతో మెయిల్‌ వచ్చినట్లు తెలిపారు. రామేశ్వరం కేఫ్‌ ఘటన మరువకముందే.. బాంబు బెదిరింపులు రావడంపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. శనివారం మధ్యాహ్నం 2.48 గంటలకు బెంగళూరులోని రద్దీ ప్రాంతాలతోపాటు రెస్టారంట్‌లు, దేవాలయాలు, బస్సులు, రైళ్లలో పేలుళ్లు జరుగుతాయని హెచ్చరించినట్లు సమాచారం. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హోం మంత్రి, నగర పోలీస్‌ కమిషనర్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. బాంబు పేలుళ్లకు పాల్పడకుండా ఉండేందుకు 2.5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశాడని వెల్లడించారు. 

బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కెఫేలో గత శుక్రవారం బాంబుపేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు హోంశాఖ అప్పగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకొంది. మరోవైపు బెంగళూరులో పోలీసు దర్యాప్తు బృందాలు నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు, బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లిపోయాడు అనే అంశంపై దృష్టిపెట్టాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని