Lockdown: కర్ణాటక, కేరళ మళ్లీ పొడిగింపు

దేశంలో సెకండ్‌ వేవ్‌ కల్లోలం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ ఉద్ధృతి ఆగకపోవడంతో పలురాష్ట్రాలు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించగా.. .....

Published : 21 May 2021 21:07 IST

బెంగళూరు/ తిరువనంతపురం: దేశంలో సెకండ్‌ వేవ్‌ కల్లోలం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ ఉద్ధృతి ఆగకపోవడంతో పలురాష్ట్రాలు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించగా.. తాజాగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. కర్ణాటకలో మరో 14 రోజుల పాటు (ఈ నెల 24 నుంచి జూన్‌ 7న ఉదయం 6గంటల వరకు) లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు సీఎం యడియూరప్ప ప్రకటించారు. వైరస్‌ కట్టడికి మే 10న ప్రకటించిన కఠిన ఆంక్షలు ఈ నెల 24తో పూర్తి కానుండటంతో మంత్రులు, సీనియర్‌ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. నిపుణుల అభిప్రాయం మేరకు లాక్‌డౌన్‌పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సీఎం యడియూరప్ప వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇది వరకు అమలవుతున్న మార్గదర్శకాలే కొనసాగుతాయని సీఎం చెప్పారు. ప్రజల కదలికలను నివారించాలని అధికారులను ఆదేశించారు. అనవసరంగా ఎవరూ తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటిస్తూ  పరిశుభ్రంగా ఉండాలని కోరారు.

కర్ణాటకలో కొత్తగా 32,218 కొత్త కేసులు రాగా.. 353 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,67,742కి చేరగా.. మరణాల సంఖ్య 24,207కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,14,238 క్రియాశీల కేసులు ఉన్నాయి.  

కేరళలో మే 30వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

కేరళలో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించారు. ఈ నెల 30వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు. తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిస్సూరులో యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ జిల్లాల్లో రేపట్నుంచి ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టంచేశారు. మలప్పురంలో మాత్రం ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ కొనసాగిస్తామని తెలిపారు. కేరళలో ఈ రోజు 1,33,558 శాంపిల్స్‌ పరీక్షించగా.. 29,673 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 142 మంది మృతిచెందగా.. ఈ రోజు 41,032మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా గణాంకాలతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు 19,79,919 మంది కోలుకోగా.. 6994మంది మృత్యువాతపడ్డారు. కేరళలో ప్రస్తుతం 3,06,346 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని