Data Protection Bill: ‘ప్రైవసీ’కి రక్షణ.. డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Data Protection Bill: దేశ పౌరుల ప్రైవసీకి రక్షణ కల్పించే డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు-2023కు లోక్‌సభలో ఆమోదం లభించింది. విపక్షాల నిరసన మధ్యే ఈ బిల్లుపై ఓటింగ్‌ చేపట్టి ఆమోదించారు.

Updated : 07 Aug 2023 15:55 IST

దిల్లీ: దేశ పౌరుల డిజిటల్‌ హక్కుల (Digital Rights)ను బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు వీలుగా తీసుకొచ్చిన ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు 2023 (Digital Personal Data Protection Bill 2023)’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. గతవారం ఈ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. సోమవారం దీనిపై చర్చ చేపట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నిరసనల మధ్యే మూజువాణీ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టి బిల్లును ఆమోదించారు.

భద్రతా కారణాలరీత్యా పౌరుల డేటాను వినియోగించుకునే అధికారం కేంద్ర సంస్థలకు ఉంటుంది. వ్యక్తిగత సమాచార గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ఆన్‌లైన్‌ వేదికలు పౌరుల డేటాను అనుమతి లేకుండా వినియోగించుకోవడాన్ని నిషేధించేలా చట్టం చేయాలని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది.

అనర్హత ఎత్తివేత.. లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్‌ గాంధీ

ఈ బిల్లు (Data Protection Bill) ప్రకారం.. డిజిటల్‌ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా.. సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ.50కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించాలనే నిబంధనను తీసుకొచ్చారు. ఈ చట్టం అమలు కోసం ‘డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ బోర్డు, దాని సభ్యులు, ఉద్యోగులు, అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు ఉండవని బిల్లులో తెలిపారు.

అయితే, కొన్ని ప్రత్యేక కేసుల్లో ప్రైవసీ రక్షణ నుంచి మినహాయింపులుంటాయి. దేశ సార్వభౌమత్వం, సమైక్యత విషయంలో వర్తించదు. దేశ రక్షణ, విదేశీ సంబంధాల విషయాల్లోనూ ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంది. తీవ్రమైన నేరాలు, కోర్టు ఆదేశాల్లోనూ వర్తించదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని