Indian railways: రైలెక్కేందుకు పోటెత్తిన ప్రయాణికులు.. ఒకరి మృతి!

రైలు ఎక్కేందుకు పెద్దఎత్తున ప్రయాణికులు పోటెత్తిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సూరత్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 11 Nov 2023 17:55 IST

గాంధీనగర్‌: రైలెక్కేందుకు పెద్దఎత్తున ప్రయాణికులు పోటెత్తడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. గుజరాత్‌లోని సూరత్‌ రైల్వేస్టేషన్‌ (Surat Railway Station)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛఠ్‌ పండగ (Chhath festival) నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకుగానూ పెద్దఎత్తున ప్రయాణికులు శనివారం సూరత్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో స్టేషన్‌ కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలోనే బిహార్‌కు వెళ్లే రైలు ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు యత్నించడంతో.. గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలోనే పలువురు స్పృహతప్పి పడిపోయారు.

రైల్వేస్టేషన్‌లో విపరీతమైన రద్దీ ఉందని, దీని కారణంగా కొంతమంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. తొక్కిసలాటతో కిందపడిపోయిన ప్రయాణికుల్లో ఒకరికి గుండె సంబంధిత సమస్య తలెత్తిందని, అతడికి సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడిని అంకిత్ వీరేంద్ర సింగ్‌గా గుర్తించారు. మరో ఇద్దరు ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్‌లో పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు తమవంతు ప్రయత్నం చేశారని హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

స్నేహితుడి ముఖంతో వీడియో కాల్‌.. డీప్‌ ఫేక్‌తో నయా మోసం!

సూరత్‌లోని వజ్ర, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే వేలాది వలస కార్మికులు ఏటా ఛఠ్‌ పూజ సమయంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. పండగ సీజన్‌లో రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపడంతోపాటు స్టేషన్‌లలో రద్దీ నిర్వహణ, భద్రత, అదనపు సిబ్బంది మోహరింపు వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని