Election Commissioners: ప్రధాని మాటే తుది నిర్ణయమని రుజువవుతోంది : శరద్‌ పవార్‌

ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే నూతన విధానాన్ని చూస్తుంటే ప్రధాని మోదీ నిర్ణయించిన ప్రకారం వారి ఎంపిక జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Published : 15 Mar 2024 00:03 IST

పుణె: కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) ఇద్దరు కమిషనర్ల (Election Commissioners)ను ఎంపిక  చేసినట్లు కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైందని.. ఇందులో నిర్ణయం ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. ఇదే విషయంపై మాట్లాడిన ఎన్‌సీపీ (శరత్‌ చంద్ర పవార్‌) అధినేత శరద్‌ పవార్‌.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే నూతన విధానాన్ని చూస్తుంటే ప్రధాని మోదీ నిర్ణయించిన ప్రకారం వారి ఎంపిక జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

గతంలో ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండేవారు. అయినప్పటికీ ఇటీవల కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆ ప్రక్రియ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిని తొలగించారు. కొత్త విధానం ప్రకారం, ఇద్దరు కేంద్ర మంత్రులు, విపక్ష నేత కొత్త కమిషనర్లను ఎంపిక చేయాలి. అంటే ప్రధాని నిర్ణయించిన వారినే కమిషనర్లుగా నియమిస్తారు’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. పుణెలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ కొత్త విధానంలో వారికి నచ్చినట్లే నిర్ణయాలు జరుగుతాయన్నారు.

కమిషన్ జారీ..

కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్లుగా మాజీ ఐఏఎస్‌ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇదిలాఉంటే, గత ఫిబ్రవరిలో ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఇటీవల రాజీనామా చేయడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో ఇద్దరు కమిషనర్ల నియామకం వేగంగా జరిగిపోయింది.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు