Dwaraka Expressway: ఇంజినీరింగ్‌ అద్భుతం.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే డ్రోన్‌ విజువల్స్

దిల్లీ-హరియాణాల మధ్య ఎనిమిదో నంబర్‌ జాతీయ రహదారిపై నిర్మించిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (Dwaraka Expressway)ను ఇంజినీరింగ్ అద్భుతం అంటూ వీడియోను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్ చేశారు. 

Published : 21 Aug 2023 19:19 IST

దిల్లీ: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (Dwaraka Expressway)కు సంబంధించిన డ్రోన్ వీడియోను ఎక్స్‌ (ప్రస్తుతం ట్విటర్‌)లో షేర్‌ చేశారు. ‘‘ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఇంజినీరింగ్‌ అద్భుతం.. కళాత్మకమైన నిర్మాణ ప్రతిభతో భవిష్యత్తులోకి ప్రయాణం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఈ రహదారి ప్రత్యేకతలు ఏంటి? దీన్ని ఇంజనీరింగ్ అద్భుతం అని ఎందుకంటున్నారో చూద్దాం. 

  • ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను దిల్లీ (Delhi)లోని ద్వారకా నుంచి హరియాణా (Haryana)లోని గుడ్‌గావ్‌ను కలుపుతూ నిర్మించారు. మొత్తం 29 కి.మీ పొడవుతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 19 కి.మీ హరియాణాలో, మిగిలిన 10 కి.మీ. దిల్లీలో ఉంటుంది. దీని నిర్మాణానికి రూ. 9 వేల కోట్లు ఖర్చైంది.
  • ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం వల్ల దిల్లీ-గుడ్‌గామ్‌ మధ్య ఉన్న ఎనిమిదో నంబర్‌ జాతీయ రహదారిపై 50 నుంచి 60 శాతం ట్రాఫిక్‌ రద్దీతోపాటు వాయు కాలుష్యం కూడా తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. డిసెంబరు 2023 నుంచి ఇది పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
  • దీని నిర్మాణంలో రెండు లక్షల టన్నుల స్టీల్‌ను ఉపయోగించారు. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ (Eiffel Tower)లో ఉపయోగించిన స్టీల్‌ కంటే ఇది 30 రెట్లు ఎక్కువ. 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించారు. ఇది దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)లో ఉపయోగించిన దానికంటే ఆరు రెట్లు అధికం. నిర్మాణ సమయంలో తొలగించిన సుమారు 1,200 చెట్లను తిరిగి మరోచోటులో నాటారు. 
  • దిల్లీ-గుడ్‌గావ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలోని శివ్‌-మూర్తి వద్ద ప్రారంభమై దిల్లీ సెక్టార్‌ 21లోని ఖేర్కి దౌలా టోల్‌ ప్లాజా వద్ద ముగుస్తుంది. దేశంలోనే తొలి ఎనిమిది లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే. ఇందులో 3.6 కి.మీ పొడవు, ఎనిమిది లైన్ల అండర్‌ టన్నెల్‌ రోడ్డును నిర్మించారు. ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌తోపాటు, అండర్‌పాస్‌ల యాక్సెస్‌ కోసం వేర్వేరు ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేశారు.
  • ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఆధునిక ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థతోపాటు, టోల్‌ మేనేజ్‌మెంట్‌, నిరంతర పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ద్వారకా నుంచి మనేసర్‌కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మనేసర్‌ నుంచి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాలు, మనేసర్‌ నుంచి సింఘు బోర్డర్‌కు 45 నిమిషాల్లో ప్రయాణించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని