Mehul Choksi: ఛోక్సీ కిడ్నాప్‌పై ఆధారాలు లేవు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని కిడ్నాప్‌ చేశారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌనీ అన్నారు.

Published : 23 Jun 2021 15:17 IST

ఆంటిగ్వా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని కిడ్నాప్‌ చేశారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌనీ అన్నారు. అయితే పబ్లిక్‌ డొమైన్లలో మాత్రం ఆయనను అపహరించినట్లు సమాచారం ఉందని తెలిపారు.

ఛోక్సీ అదృశ్యం వ్యవహారంపై ఆంటిగ్వా పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఛోక్సీని ఉద్దేశపూర్వకంగానే డొమినికాకు తీసుకెళ్లారన్న ఆరోపణలపై సాక్ష్యాలు లభించాయా అని ప్రతిపక్ష ఎంపీ అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ప్రధాని బ్రౌనీ స్పందిస్తూ ‘‘స్పష్టమైన ఆధారాలైతే లేవు. కానీ మెహుల్‌ ఛోక్సీ కిడ్నాప్‌ అయినట్లు పబ్లిక్‌ డొమైన్‌లలో సమాచారం ఉంది. అంతేగాక, దర్యాప్తు సంస్థలు కూడా దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు తగిన సాక్ష్యాలు మాత్రం లేవు’’ అని చెప్పినట్లు ఆంటిగ్వా న్యూస్‌రూం కథనం వెల్లడించింది. ఛోక్సీ కిడ్నాప్‌ వార్తలపై విచారణకు సంబంధించి ఏ దర్యాప్తు సంస్థ కూడా తమ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని బ్రౌనీ తెలిపారు. 

పీఎన్‌బీ బ్యాంకును రూ. 13,500కోట్లకు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన ఛోక్సీ.. గత నెల 23న ఉన్నట్టుండి ఆంటిగ్వాలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే పక్కనే ఉన్న డొమినికాలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛోక్సీ అదృశ్యంపై అనేక వార్తలు వచ్చాయి. క్యూబా పారిపోయేందుకు ఆయన అక్రమంగా డొమినికాలో ప్రవేశించారని అక్కడి పోలీసులు తెలిపారు. కానీ ఛోక్సీ న్యాయవాదులు మాత్రం ఆయనను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని బలంగా వాదిస్తున్నారు. దీనిపై వారు బ్రిటన్‌ ప్రైవీ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై డొమినికా కోర్టులో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. మరోవైపు ఆయనను భారత్‌కు రప్పించేందుకు ఇక్కడి దర్యాప్తు సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని