Hacking Row: ‘హ్యాక్‌ అలర్ట్‌’ దుమారం.. యాపిల్‌కు పార్లమెంట్‌ కమిటీ సమన్లు..?

Hacking Attempt alert Row: హ్యాకింగ్‌ అలర్ట్ వ్యవహారంపై యాపిల్‌ (Apple) ప్రతినిధులకు పార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Published : 01 Nov 2023 14:02 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లకు మంగళవారం ‘హ్యాక్‌ అలర్ట్‌ (Hacking Attempt alert)’ మెసేజ్‌లు రావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ఆ సందేశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ హ్యాక్‌ అలర్ట్‌ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. దీనిపై వివరణ కోరుతూ యాపిల్‌ (Apple) సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఐటీశాఖ (IT)పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం (Parliamentary Standing Committee ).. రాబోయే సమావేశంలో ఈ ‘హ్యాక్ అలర్ట్‌’ అంశంపై చర్చించనుందని ఈ కమిటీ సెక్రటేరియట్‌ ఆఫీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్టాండింగ్‌ కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిందని తెలిపాయి. ఈ వ్యవహారంపై యాపిల్‌ ప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని కమిటీ యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

యాపిల్‌ ఫోన్ల హ్యాకింగ్‌?

తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగిందని మంగళవారం పలువురు విపక్ష నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమ ఐఫోన్లకు అలర్ట్‌ సందేశాలు వచ్చాయని వారు వెల్లడించారు. దీంతో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ.. హ్యాకింగ్‌ ప్రయత్నం జరిగినట్లు వ్యక్తమైన అనుమానాలపై నిగ్గు తేల్చేందుకు ‘కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ) ద్వారా సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని వెల్లడించింది.

అటు యాపిల్ కూడా దీనిపై స్పందించింది. నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమని పేర్కొంది. ఒక్కోసారి యాపిల్‌ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్‌ నోటిఫికేషన్లు నకిలీ హెచ్చరికలు అయి ఉండొచ్చు అని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని