Farmers Protest: ‘రైతు సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని చర్చించాలి’

Farmers Potest: రైతు సమస్యల పరిష్కారానికి చర్చలు జరపనున్న కేంద్ర మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ మాట్లాడాలని రైతు నేతలు కోరారు.

Updated : 15 Feb 2024 18:41 IST

దిల్లీ/చండీగఢ్‌: తమ డిమాండ్ల ఆమోదం కోసం ఆందోళన చేస్తున్న రైతులతో (Farmers Protest) కేంద్రం తరఫున ముగ్గురు మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ (PM Modi) చర్చించాలని రైతు సంఘాల నాయకులు కోరారు. గురువారం శంభు సరిహద్దు ప్రాంతంలో ‘కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ’ ప్రధాన కార్యదర్శి శర్వాన్‌ సింగ్ పంథేర్‌ మీడియాతో మాట్లాడారు.  కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు అనుమతించాలన్నారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లో రైతులపై పారామిలటరీ బలగాలు బాష్ప వాయుగోళాలు ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. ‘‘ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా వెనక్కి పంపాలని చూస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మా డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తేలేదు’’ అని తెలిపారు. 

పంటకు కనీస మద్దతు ధర (MSP)తో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ‘దిల్లీ చలో’కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పంజాబ్‌ నుంచి రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా, వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. బారికేడ్లు, కాంక్రీట్‌ దిమ్మెలు, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేసింది. వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు బాష్ప వాయుగోళాలు, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు చండీగఢ్‌లో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్‌, అర్జున్‌ ముండా, నిత్యానంద్‌ రాయ్‌ రైతు నేతలతో సమావేశం కానున్నారు. 

మరోవైపు ‘దిల్లీ చలో’ చేపట్టిన రైతులకు మద్దతుగా ‘భారతీయ కిసాన్‌ యూనియన్‌’ పంజాబ్‌లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు వరకు రైల్‌ రోకోకు పిలుపునిచ్చింది. దాంతోపాటు టోల్‌ ప్లాజాల వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు వరకు నిరసన చేపట్టాలని ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని