Pneumonia: చైనాలో నిమోనియా.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచన

చైనాలోని చిన్నారుల్లో నిమోనియా (Pneumonia) వ్యాపిస్తోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇటువంటి వాటిని ఎదుర్కొనే సంసిద్ధతపై తక్షణమే సమీక్ష నిర్వహించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

Published : 26 Nov 2023 16:43 IST

దిల్లీ: చైనాలోని చిన్నారుల్లో వ్యాపిస్తోన్న నిమోనియాపై (Pneumonia) ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి! అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని చైనా పేర్కొనగా.. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా చైనాను సంప్రదించి దానిపై నివేదిక తెప్పించుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన కేంద్రం.. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయినప్పటికీ అటువంటి సమస్యలు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధతపై సమీక్ష చేసుకోవాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) లేఖ రాసింది.

ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. మానవ వనరులు, ఆసుపత్రి పడకలు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌, యాంటీబాడీలు, పీపీఈ, టెస్టు కిట్ల వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా ఆక్సిజన్‌ ప్లాంట్లు, వెంటిలేటర్ల పనితీరు, ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిశితంగా సమీక్ష జరపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఇన్‌ఫ్లుయెంజా వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల శ్వాబ్‌ నమూనాలను వైరస్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌లకు పంపించాలన్నారు. తద్వారా కొత్త వైరస్‌ల ప్రభావం ఏమైనా ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చని అన్నారు.

చైనాలో అంతుచిక్కని నిమోనియా.. మరో మహమ్మారి రాబోతుందా?

ఇదిలా ఉంటే, చైనాలో నిమోనియా కేసుల విజృంభణను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై అవసరమైన చర్యలను చేపడుతున్నామని.. భారత వైద్య పరిశోధన మండలి (ICMR), ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ ఈ అంశంపై పరిశీలన సాగిస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో నిమోనియా బాధితుల్లో ఎటువంటి కొత్త వైరస్‌ లేదని తెలిసిందని చైనా అధికారిక పత్రిక వెల్లడించింది. ముఖ్యంగా బీజింగ్‌, లియోనోంగ్‌లో చేసిన పరీక్షల్లో ఎటువంటి కొత్త వైరస్‌ను గుర్తించలేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని