Published : 07 Jan 2021 01:45 IST

జాక్‌ మాది అజ్ఞాతమా..? నిర్బంధమా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాక్‌మా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అలీబాబాతో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించి అతితక్కువ కాలంలోనే గొప్పవ్యాపార వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన వ్యాపారాన్ని ప్రపంచ నలమూలలకు విస్తరించి.. మేధావిగా అందరి ప్రశంసలు అందుకొన్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరుగా నిలిచారు. చైనాను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడంలోనూ కీలక భూమిక పోషించారు. అలాంటి వ్యక్తి అదృశ్యం అవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజంగానే ఆయన అదృశ్యమయ్యారా? లేదంటే చైనా ప్రభుత్వమే నిర్బంధించిందా? అసలు చైనా పాలకులతో జాక్‌మాకు వైరం ఎక్కడ?

జాక్‌మాది చిన్నప్పటి నుండే కష్టపడి పనిచేసే స్వభావం. తన 12 ఏళ్ల వయసులోనే ఇంగ్లీష్‌ నేర్చుకుని పర్యటనలు, వాణిజ్యం కోసం చైనా వచ్చే విదేశీయులకు గైడ్‌గా ఉచిత సేవలు అందించారు. అలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు అవ్వాలనే లక్ష్యంతో 'హాంగ్జౌ టీచర్స్ యూనివర్సిటీ' ప్రవేశ పరీక్ష రాసి విద్యనభ్యసించారు జాక్‌మా. చదువు పూర్తిచేసిన తర్వాత అక్కడే వెయ్యి రూపాయల వేతనానికి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. జీతం సరిపోక పెద్ద హోటల్‌లో లేదంటే బహుళజాతి సంస్థలో ఉద్యోగిగా చేరాలనే లక్ష్యంతో ఉండేవాడు జాక్. సరిగ్గా అదే సమయంలో 1992 నాటికి చైనాలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వచ్చాయి. ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ తీసుకోలేదు. దాంతో సొంతంగా అనువాద సంస్థ ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు.

అలా వ్యాపారంలోకి...
1995లో చైనా వ్యాపార బృందంతో కలిసి అమెరికా పర్యటించి.. స్నేహితుడి సాయంతో తొలిసారి అంతర్జాలం గురించి తెలుసుకున్నాడు. అందులో చైనాకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో దాన్నో అవకాశంగా తీసుకున్నాడు. అతి తక్కువ పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు జాక్‌ మా. తన వెబ్‌సైట్‌తో చైనా టెలికామ్ సంస్థ జీఎం సైట్‌కి గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో చైనా పేజెస్‌ వెబ్‌సైట్‌ పనితీరు నచ్చిన జీఎం.. అందులో కోటి రూపాయిలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అలా జీఎంకి చెందిన ఐదుగురు, జాక్‌మా తరఫున ఇద్దరితో బోర్డ్‌ ఏర్పాటైంది. అందులో జీఎం మనుషులదే పైచేయిగా ఉండటంతో లాభం లేదని సంస్థ నుంచి జాక్‌ మా బయటకొచ్చేసి.. 1999లో ఒకరోజు పరిచయస్తులకి ఆన్‌లైన్‌ వ్యాపార ఆలోచనల్ని వివరించారు. అతడి ఆలోచనలు నచ్చిన మిత్రులు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రారంభించేబోయేది మిగతా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల తరహా వ్యాపారికీ, వినియోగదారుడికీ మధ్య వారధిగా కాకుండా వ్యాపారికీ-వ్యాపారికీ మధ్య వారధిగా ఉండాలని జాక్‌మా భావించారు. అలా 1999లో విదేశీ రిటైలర్లతో కలిసి చైనాలోని ఈస్టరన్ సిటీ హాంగ్జౌలోని అపార్ట్‌మెంట్‌లో 18 మంది సభ్యులతో కలిసి అలీబాబా సంస్థ ఏర్పాటు చేశారు. అది 20 ఏళ్లలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంగా అది అవతరించింది. 66 వేలకు పైగా ఫుల్ టైం ఉద్యోగులతో 420 బిలియన్ డాలర్ల విలువతో మార్కెట్ విస్తరించింది. అలీబాబా గ్రూప్‌లో చాలా కంపెనీలు ఉన్నాయి. 2016లో ఆసియాలో అపర కుబేరుడైన డాలియన్ వాండా గ్రూప్ ఛైర్మెన్ గ్‌జియాన్‌లిన్‌ను దాటుకుని ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అలీబాబా అధినేత నిలిచారు. 

చైనా ఆర్థిక వ్యవస్థలో తనవంతు
చైనా రెండో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో జాక్‌మా హస్తం ఉందనే చెప్పాలి. ఆ దేశ వాణిజ్యరంగాన్ని ముందుకు నడిపిన జాక్‌మా తాను.. కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తినని ఓ సందర్భంలో చెప్పారు. ఒకప్పుడు కేఎఫ్‌సీ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా తన దరఖాస్తును ఆ కంపెనీ తిరస్కరించింది. ఇప్పుడదే కేఎఫ్‌సీ అలీబాబా సంస్థలో 5.3 శాతం వాటాలు అంటే 24.6 బిలియన్ డాలర్లు మేర వాటా కలిగి ఉంది. రానున్న అయిదేళ్లలో అలీబాబాతో లక్షల ఉద్యోగాల్ని సృష్టించి తద్వారా చైనా సామాజిక, ఆర్థిక వ్యవస్థలో పెద్దఎత్తున మార్పు తీసుకు రావాలని జాక్‌మా సంకల్పించారు. అలీబాబాని ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌గా తీర్చిదిద్దాలని ఆయన భావించారు. కానీ చైనాతో ప్రభుత్వంతో ఏర్పడ్డ వివాదంతో జాక్‌ మా తన ఆలోచనలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. 2 నెలల క్రితం నవంబరులో ఆయన నిర్వహిస్తున్న టాలెంట్‌ షో ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాల్సి ఉంది. కానీ, ఆయన రాలేదు. జాక్‌ మా స్థానంలో అలీబాబా ఎగ్జిక్యూటివ్‌ ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి కూడా జాక్‌ మా ఎప్పుడూ బయటి ప్రపంచానికి కనబడలేదు. షెడ్యూల్‌ వివాదం కారణంగా ఫైనల్‌ ఎపిసోడ్‌కు జాక్‌ మా రాలేదని అలీబాబా అధికారి ప్రతినిధి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామానికి ముందు ప్రభుత్వంతో ఆయకు విభేదాలు తలెత్తాయి.

చైనాతో ఉన్న వివాదమేమిటి?
గతేడాది అక్టోబర్‌ 24న చైనాలో ఓ సమ్మిట్‌ జరిగింది. అక్కడ జాక్‌మా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చైనాకు చెందిన దిగ్గజ బ్యాంకర్లు కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా జాక్‌మా తన ప్రసంగంలో చైనా ఆర్థిక వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాలగా వ్యవహరిస్తున్నాయని, ఈ వైఖరికి స్వస్తి పలికి విస్తృతంగా ఆలోచించాలని సూచించారు. సంప్రదాయబద్ధంగా ఉన్న ఆర్థిక విధానాల్లో సంస్కరణలు అవసరమన్నారు. చైనాకు బాసెల్‌ ఒప్పంద నిబంధనలు ఏమాత్రం సరిపడవని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యాలన్నీ సంచలనం కావటమే కాదు.. నేరుగా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ను తాకాయి. దీంతో జాక్‌ మాకు గుణపాఠం నేర్పాలని నిర్ణయించిన ఆయన.. అనుకున్నదే తడవుగా యాంట్‌గ్రూప్‌ ఐపీఓలో లోపాలు వెతికిపట్టాలని నియంత్రణ సంస్థలను ఆదేశించారని.. నవంబర్‌ 12న వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ కథనం రాసింది. ఫలితంగా ఐపీఓకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందే చైనా అధికారులు కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే కారణం చూపుతూ ఐపీఓను నిలిపివేశారు. ఈ ఐపీఓ రూపంలో 27 బిలియన్‌ డాలర్ల నుంచి దాదాపు 36 బిలియన్‌ డాలర్ల మధ్యలో సమీకరించాలన్న యాంట్‌ గ్రూప్‌ ఆశలపై నీళ్లు జల్లారు. ఈ ఐపీఓ ముగిస్తే కంపెనీ విలువ కూడా 350 బిలియన్‌ డాలర్ల నుంచి 450 బిలియన్‌ డాలర్ల మధ్యకు చేరుతుంది.

ఏంటీ యాంట్‌ గ్రూప్‌
జాక్‌మా స్థాపించిన మరో కంపెనీ ఇది. దశాబ్దకాలంగా చైనాలో చెల్లింపులకు, పెట్టుబడులకు, రుణాలతో సహా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉందీ సంస్థ. చెల్లింపుల విషయంలో అన్ని విధాలుగా వెసులుబాటు కల్పించటం వల్ల కొద్ది కాలంలోనే సంస్థకు మంచి ఆదరణ లభించింది. తర్వాత యాంట్‌గ్రూప్‌ ఐపీవో దిశగా అడుగులు వేసింది. గతేడాది నవంబర్‌లో ఇది ప్రారంభించాలని అంతా రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీవోగా ఇది అవతరిస్తుందని భావించారు. యాంట్‌ గ్రూప్‌లో యాంట్‌ ఫినాన్షియల్‌, అలీపే సంస్థలు ఉంటాయి. అలీపే సంస్థ పేమెంట్‌ సేవలు అందిస్తోంది. యాంట్‌ ఫినాన్షియల్‌ సంస్థ ఆర్థిక, సాంకేతిక, పేమెంట్‌ ప్రాసెసర్‌ వంటి సేవలు అందుబాటులోకి తెచ్చింది. అలీపేకు యాంట్‌ గ్రూప్‌ను మాతృసంస్థగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన అంకుర సంస్థగా ఇది రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ విలువ 150 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. చైనా జనాభాలో మూడోవంతు మంది ఈ సంస్థలో వినియోగదారులుగా ఉన్నారు. ఇందులో 33% వాటాలు అలీబాబా గ్రూపునకు ఉన్నాయి. ఇదంతా బిలియనీర్‌ జాక్‌ మా నియంత్రణలోనే సాగుతుంది. ఈ జోరుతోనే ఐపీవోకి వెళ్లాలని చూశారు జాక్‌మా. అయితే, కొన్ని వారాల ముందు జరిగిన సదస్సులో జాక్‌మా చేసిన వ్యాఖ్యలు ఐపీవోపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ క్రమంలో జాక్‌మా సహా కంపెనీ సీనియర్‌ అధికారులకు నోటీసులు జారీ చేశారు. హాంగ్‌కాంగ్, షాంఘై మార్కెట్లలో ఈ ఐపీఓను నిలిపివేశారు. నవంబర్‌ మొదటి వారంలో ఐపీఓ నిలిపివేయడం వల్ల అలీబాబా షేర్లు భారీగా పతనం అయ్యాయి.

ఇంతకీ ఎక్కడున్నారు..?
జాక్‌మా కనిపించటం లేదు సరే..! ఇంతకీ ఆయన ఎక్కడున్నట్టు..? ఇందుకు సంబంధించి ఏమైనా సమాచారం లభించిందా..? బిలియనీర్‌ కనిపించకుండా పోతే అది సంచలనం కాకుండా ఉంటుందా..? ఇప్పుడూ అదే జరుగుతోంది. అదే సమయంలో ఆయన ఎక్కడున్నారో చూచాయిగా చెబుతున్నాయి పలు కథనాలు. తనంత తానుగానే జాక్‌మా అజ్ఞాతంలోకి వెళ్లారని కొందరు చెబుతుంటే... ఆయనను జైల్లో ఉంచారని మరి కొందరు అంచనా వేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి సమాచారమూ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. తమకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జాక్ మా అదృశ్యం కాలేదని సీఎన్‌బీసీ పేర్కొంది. ఆయన ఉద్దేశపూర్వకంగానే అజ్ఙాతంలోకి వెళ్లారని తెలిపింది. విశ్రాంతి తీసుకోవాలనే కోరికతోనే ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతోంది. జాక్ మా ప్రస్తుతం గ్ఝెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని.. హాంగ్ఝౌలో ఉన్నారని చెబుతోంది. అలీబాబా కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్నదక్కడే. జాక్ మా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికే అవకాశాలు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఆయన ఎవరి అధీనంలోనూ లేడని, ఒకరి చేతిలో బందీగా ఉన్నారనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన ఒకరిద్దరు అత్యున్నత పారిశ్రామిక వేత్తలతో మాత్రమే జాక్ మా తరచూ మాట్లాడుతున్నట్టు తేలిందని, వారి ద్వారానే తమకు ఈ సమాచారం అందినట్లు సీఎన్‌బీసీ తెలిపింది.

ఇదే తొలిసారి కాదు..
చైనా పాలకులు పారిశ్రామికవేత్తలపై వేటు వేయటం ఇదే తొలిసారి ఏమీ కాదు. గతంలో చైనాలో రియల్ ఎస్టేట్ రారాజుగా పేరు సంపాదించుకున్న రెన్ జికియాంగ్‌పైనా ఈ తరహాలోనే తమ ఆగ్రహం చూపించారు డ్రాగన్ పాలకులు. 18 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించారు. 2017లో టుమారో గ్రూప్‌ అధినేత షియావో జియాన్హువానూ అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచింది చైనా ప్రభుత్వం. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్నీ ఎక్కడికక్కడ కూల్చి వేసింది. ప్రభుత్వ విధానాలకు లోబడి ఉండకపోవటమే ఆయన తప్పు. ఇలా పలువురు వ్యాపారవేత్తలను ఇబ్బంది పెట్టిన చరిత్ర చైనాలో కనిపిస్తోంది. అయితే.. జాక్‌మా కావాలనే కనబడకుండా వెళ్లారన్న వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేశాక.. ఆ ప్రభావం కొన్నాళ్ల పాటు ఉంటుందని గ్రహించే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని పలువురు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి.. మళ్లీ ఎప్పటిలాగే వ్యాపారం కొనసాగించారన్నది మరి కొందరి విశ్లేషణ. కానీ ఈ సారి చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడి వరకు వెళ్లటమే ఇంత విభేదాలకు దారి తీసింది. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపులూ వచ్చాయని తెలుస్తోంది. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా.. ఓ బిలియనీర్‌ ఇలా కనిపించకుండా పోవటం మాత్రం సంచలనమే. ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైన వేళ చైనా ప్రభుత్వం స్పందిస్తుందా..? లేదా జాక్‌మానే అజ్ఞాతం వీడి బయటకు వస్తారా..? ఈ అంశాలపై ఎప్పుడు స్పష్టత వస్తుందోనని వేచి చూడక తప్పదు!!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని