Sri Lanka: మహిళలు.. గర్భధారణను వాయిదా వేసుకోండి

కొవిడ్‌ విజృంభణతో శ్రీలంక అల్లాడుతోంది. మహమ్మారి కారణంగా పరిస్థితులు దిగజారడంతో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆహార సంక్షోభాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో....

Published : 09 Sep 2021 18:38 IST

శ్రీలంక ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన

కొలంబో: కొవిడ్‌ విజృంభణతో శ్రీలంక అల్లాడుతోంది. మహమ్మారి కారణంగా పరిస్థితులు దిగజారడంతో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆహార ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. మహిళలు కొన్నాళ్లపాటు గర్భధారణను వాయిదా వేసుకోవాలని సూచించింది. వైరస్‌ బారినపడి గత నాలుగు నెలల వ్యవధిలో 40కు పైగా గర్భిణులు మృతి చెందిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. ‘సాధారణంగా ఏడాదికి 90- 100 వరకు ప్రసూతి సంబంధిత మరణాలు నమోదవుతాయి. కానీ.. మేలో మూడో వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క కొవిడ్‌తోనే 41 మంది గర్భిణులు మృతి చెందార’ని ప్రభుత్వ ఆరోగ్య ప్రచార బ్యూరో డైరెక్టర్ చిత్రమాలి డి సిల్వా ఓ వార్తసంస్థకు తెలిపారు. ప్రభుత్వ గైనకాలజిస్ట్ హర్ష ఆటపట్టు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో సంతానాన్ని ఆశిస్తున్నవారు తమ ప్రయత్నాలను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే 5,500 మంది గర్భిణులకు వైరస్‌ సోకగా, వారిలో దాదాపు 70 శాతం మంది ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తయినవారేనని వెల్లడించారు.

ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్‌లో..

2.1 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులతో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. సెప్టెంబర్ మధ్యలో దీన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నా.. అక్టోబర్ ప్రారంభం వరకు కఠిన ఆంక్షలు విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు జనాభాలో దాదాపు సగం మంది ఇప్పటికే రెండు డోసులు అందుకున్నారు. గర్భిణులూ విధిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. ఇప్పటివరకు ఈ దేశంలో 4.75 లక్షల మంది వైరస్‌ బారిన పడగా.. 10,500కుపైగా మరణాలు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని