India-Taliban: భారత్‌ ఆందోళనల పట్ల తాలిబన్ల సానుకూల స్పందన!

అలాగే అఫ్గాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల తాలిబన్లు సానుకూలంగానే ఉన్నట్లు సంకేతాలందాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు...

Updated : 04 Sep 2021 15:51 IST

సహేతుక పరిష్కారం దిశగా సంకేతాలిచ్చారన్న శ్రింగ్లా

వాషింగ్టన్‌: తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌లో పాక్‌ చర్యల్ని భారత్‌-అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. అలాగే అఫ్గాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల తాలిబన్లు సానుకూలంగానే ఉన్నట్లు సంకేతాలందాయన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని శ్రింగ్లా తెలిపారు. పరిణామాలు వేగంగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందన్నారు. భారత్‌ సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందన్నారు. తాలిబన్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారో.. లేదో.. చూడాల్సి ఉందన్నారు. తాలిబన్లతో తమ భేటీ చాలా తక్కువ సమయమే జరిగిందన్నారు. ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. అయితే, భారత్‌ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సహేతుకంగానే ప్రవర్తించే అవకాశం ఉన్నట్లు వారు సంకేతాలిచ్చారన్నారు.

ఉగ్రవాదానికి అఫ్గాన్‌ భూభాగం అడ్డాగా మారొద్దని తాలిబన్లకు స్పష్టంగా చెప్పామని శ్రింగ్లా తెలిపారు. అలాగే మహిళలు, మైనారిటీల పట్ల విచక్షణతో వ్యవహరించాలని కోరామన్నారు. వీటిపై వారు సానుకూలంగా స్పందించారన్నారు. అఫ్గానిస్థాన్‌లో వివిధ శక్తుల ప్రమేయం ఏ రకంగా ఉండబోతోందో గమనిస్తామన్నారు. తాలిబన్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన పాకిస్థాన్‌.. అఫ్గాన్‌ భూభాగంలోని అనేక శక్తులకు అండగా నిలిచిందన్నారు. గత నెల భారత అధ్యక్షతన అఫ్గాన్‌ పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి తీర్మానం చేసిన విషయాన్ని శ్రింగ్లా గుర్తు చేశారు. జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబా వంటి నిషేధిత సంస్థల పేర్లను తీర్మానంలో పేర్కొన్నామన్నారు. ఈ రెండు సంస్థలు అఫ్గాన్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని.. వీరి పాత్రపై దృష్టి సారిస్తామన్నారు. ఈ కోణంలోనే పాక్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

అఫ్గానిస్థాన్‌ భూభాగాన్ని తాలిబన్ల అడ్డాగా మారనివ్వబోమని తాలిబన్లు అమెరికాకు హామీ ఇచ్చారని శ్రింగ్లా తెలిపారు. ఒకవేళ అఫ్గాన్‌ నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు సాగినా దానికి తాలిబన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా స్పష్టం చేసిందన్నారు. అఫ్గాన్‌లోని పరిస్థితులు, పాకిస్థాన్‌ పాత్రపై అమెరికాతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతాయని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని