Global Hunger Index: పాక్‌ కంటే భారత్ పరిస్థితే ఆందోళన కలిగిస్తోంది..!

ప్రపంచ ఆకలి సూచిక(జీహెచ్‌ఐ)లో భారత్ స్థానం మరింత కిందకు పడిపోయింది. 2020లో వెలువరించిన సూచికలో 94వ స్థానంలో ఉన్న మనదేశం.. 2021లో 101వ స్థానానికి దిగజారింది. 116 దేశాల జాబితాలో మన స్థానమది. పొరుగున ఉన్న నేపాల్‌(76), బంగ్లాదేశ్‌(76), మయన్మార్‌(71), పాకిస్థాన్‌(92) కంటే భారత్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది.

Published : 16 Oct 2021 02:24 IST

ప్రపంచ ఆకలి సూచికలో 101 వ స్థానానికి పడిపోయిన భారత్

దిల్లీ: ప్రపంచ ఆకలి సూచిక(జీహెచ్‌ఐ)లో భారత్ స్థానం మరింత కిందకు పడిపోయింది. 2020లో వెలువరించిన సూచికలో 94వ స్థానంలో ఉన్న మనదేశం.. 2021లో 101వ స్థానానికి దిగజారింది. 116 దేశాల జాబితాలో మన స్థానమది. పొరుగున ఉన్న నేపాల్‌(76), బంగ్లాదేశ్‌(76), మయన్మార్‌(71), పాకిస్థాన్‌(92) కంటే భారత్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది. ఈ దేశాలు కూడా ఆందోళన కలిగించే విభాగంలోనే ఉన్నప్పటికీ తమ దేశంలోని పౌరులకు ఆహారం అందించడంలో భారత్‌ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. ఐర్లాండ్‌కు చెందిన Concern Worldwide, జర్మనీకి చెందిన Welt Hunger Hilfe సంయుక్తంగా ఈ ఆకలి సూచికకు సంబంధించిన నివేదికను తయారు చేశాయి. భారత్‌లో ఆహార స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నాయి. 

భారత్‌ జీహెచ్‌ఐ స్కోరు 2000లో 38.8 గా ఉండగా.. 2012-2021 మధ్యలో 28.8 నుంచి 27.5కి పడిపోయింది. పోషకాహార లేమి, చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఐదేళ్ల లోపు పిల్లల్లో వారి వయసుకు తగ్గ బరువు లేకపోవడం, ఆ వయసు వారిలో మరణాలు..  ఈ సూచికల ఆధారంగా జీహెచ్‌ఐ స్కోరును గణిస్తారు. కొవిడ్‌-19, మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది చిన్నపిల్లల్లో పోషకాహార లేమికి దారితీసింది. ఆ విషయంలో భారత్ ముందు వరుసలో ఉందని పేర్కొంది. అయితే ఆ సూచికల్లో భారత్ కాస్త మెరుగవుతోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆకలికి వ్యతిరేకంగా జరుపుతోన్న పోరాటం దారి తప్పిందని, 47 దేశాలు 2030నాటికి తక్కువ ఆకలి స్థాయుల్ని సాధించలేవని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నివేదికను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

‘పేదరికం, ఆకలి, భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా, డిజిటల్ ఎకానమీగా మార్చడం.. వంటి వాటిని నిర్మూలించినందుకు మోదీకి అభినందనలు. ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌ 2020లో 94 వ స్థానంలో ఉంది. 2021లో అది 101వ స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్, నేపాల్ కంటే భారత్‌ వెనుకబడి ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని