Corona: ఫ్రాన్స్‌లో కొవిడ్‌ కల్లోలం.. ఒకేరోజు లక్ష కేసులు

ఫ్రాన్స్‌లో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. ఒకేరోజు లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మందికి కొవిడ్‌ పాజిటివ్​గా తేలినట్లు ఫ్రాన్స్ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ వెల్లడించింది......

Published : 26 Dec 2021 22:59 IST

ప్యారిస్‌: ఫ్రాన్స్‌లో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. ఒకేరోజు లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మందికి కొవిడ్‌ పాజిటివ్​గా తేలినట్లు ఫ్రాన్స్ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ వెల్లడించింది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్య శాఖ మంత్రి ఒలీవర్ వెరన్ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ వేరియంట్‌ కేసులే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కేసులు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ సోమవారం అధికారులతో భేటీ కానున్నారు. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

దేశంలో ఒమిక్రాన్‌ తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. రెండు డోసులు తీసుకున్న 18 ఏళ్లు దాటినవారంతా బూస్టర్‌ డోసు తీసుకోవచ్చని శుక్రవారమే వెల్లడించారు. బూస్టర్ డోసును ప్రజలు తీసుకుంటేనే.. తాము అందించే హెల్త్ పాస్‌లు చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం యోచిస్తోంది. కేఫ్‌లు, రెస్టారెంట్‌లు, ప్రజా రవాణా యాక్సెస్ సహా.. అంతర్జాతీయ ప్రయాణాలకు ఈ పాస్‌లు తప్పనిసరి. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 76.5శాతం మంది టీకాలు తీసుకున్నారు. కరోనా కారణంగా 1,22,546 మంది మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని