Bilkis Bano case: ‘బిల్కిస్ బానో కేసులో అప్పుడే న్యాయం’: ఏకైక ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..?

దోషుల్ని ఉరితీయాలని.. లేకపోతే జీవితాంతం జైల్లో ఉంచాలని బిల్కిస్‌ బానో కేసు(Bilkis Bano case)లో ఏకైక ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు.

Updated : 12 Jan 2024 14:01 IST

అహ్మదాబాద్‌: బిల్కిస్‌ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల (Convicts) శిక్షా కాలం తగ్గింపుని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షి స్పందించారు.

2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో(Bilkis Bano) కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పుడు ఈ ప్రత్యక్ష సాక్షి వయసు ఏడేళ్లు. ఇప్పుడు 28 సంవత్సరాలు. ‘నా వాళ్లను కళ్ల ముందే చంపడం చూసి, ఎంతో వేదనకు గురయ్యాను. ఆ రోజు మృతి చెందిన 14 మందిలో నా తల్లి, సోదరి ఉన్నారు. ఇన్నేళ్లు గడిచినా.. ఆ ఘోర ఘటన నన్ను వెంటాడుతూనే ఉంది. అది గుర్తొస్తే ఇప్పటికీ ఉలిక్కిపడి లేస్తుంటాను. ఆ దోషుల్ని విడుదల చేసిన రోజున చాలా బాధేసింది. కానీ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త ఊరటనిచ్చింది. వారిని ఉరి తీయాలి లేకపోతే జీవితాంతం జైల్లో ఉంచాలి. అప్పుడే న్యాయం జరిగినట్లు’ అని ఆ సాక్షి అన్నారు. ఆ ఘటనలో 17 మందిపై దాడి చేయగా.. 14 మంది మృతి చెందారు. బిల్కిస్ బానో, ఈ సాక్షి, మరో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే విచారణ సందర్భంగా అతడు 11 మంది దోషుల్లో నలుగురిని గుర్తించాడు.

ఈ కేసులో దోషులకు 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. ఆ ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. వారి విడుదల చెల్లదని జనవరి ఎనిమిదిన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని