Simultaneous polls: ‘జమిలి’ అంటే రాష్ట్రాలపై దాడి చేయడమే: రాహుల్‌ గాంధీ

జమిలి ఎన్నికల (Simultaneous Polls) సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది.

Updated : 03 Sep 2023 15:51 IST

దిల్లీ: జమిలి ఎన్నికల (Simultaneous Polls) సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడింది. ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది.

‘జమిలి’ కమిటీలో 8 మంది.. ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

‘ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు.. భారత్‌ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. భారత్‌ అంటే రాష్ట్రాల సమైఖ్యత అన్నారు. ‘జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

ఇక ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఛైర్మన్‌గా 8 మంది ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటయ్యింది. వెంటనే పని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది. అయితే, ఇందుకు స్పష్టమైన గడువు మాత్రం నిర్దేశించలేదు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విధివిధానాలను అదే రూపొందించుకోవచ్చని.. ఇది ప్రజల సూచనలనూ  వింటుందని తాజా గెజిట్‌లో పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి, అవసరమైనవాటిని తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని