Rajya Sabha polls: రాజ్యసభ రేసులో సాగరిక ఘోష్‌.. నలుగురి పేర్లు ఖరారు చేసిన టీఎంసీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ రాజ్యసభ అభ్యర్థులుగా జర్నలిస్టు సాగరిక ఘోష్‌తో పాటు మరో ముగ్గురి పేర్లను ఖరారు చేసింది.

Updated : 11 Feb 2024 16:52 IST

కోల్‌కతా: రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections) సమీపిస్తున్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేసింది. జర్నలిస్టు సాగరిక ఘోష్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుస్మితా దేవ్‌, మరో ఇద్దరి పేర్లను ఎంపిక చేసింది.  ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘‘రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులుగా సాగరిక ఘోష్‌, సుస్మితా దేవ్‌, మహ్మద్‌ నదిముల్‌ హక్‌, మమతా ఠాకూర్‌లను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వారందరికీ శుభాకాంక్షలు.  తృణమూల్ కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన వీరంతా భారతీయుల హక్కుల కోసం వాదించే మా పార్టీ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌ను సాగరిక ఘోష్‌ రీట్వీట్‌ చేశారు.  సాగరిక ఘోష్‌ ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సతీమణి కావడం గమనార్హం. ప్రఖ్యాత మీడియా సంస్థల్లో పనిచేసిన ఆమె జర్నలిజంలో అనేక అవార్డులు సాధించారు. పలు పుస్తకాలు కూడా రచించారు.

దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నిలకు దరఖాస్తులు స్వీకరణ మొదలవ్వగా.. ఆఖరు తేదీ ఫిబ్రవరి 15.  ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని