Tomato Robbed: మార్కెట్‌కు తరలిస్తుండగా రెండు వేల కిలోల టమాటాల చోరీ..

టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో వాటి చోరీ ఘటనలూ ఎక్కువయ్యాయి.  తాజాగా వాటిని మార్కెట్‌కు తరలిస్తున్న వాహనాన్ని చోరీ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

Updated : 10 Jul 2023 17:45 IST

బెంగళూరు: మార్కెట్‌లో ప్రస్తుతం టమాటా (tomatoes)ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చోరీల ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్న కర్ణాటకలో ఓ రైతు పొలంలో 60 బస్తాల టమాటాలను ఎత్తుకెళ్లారు. తాజాగా టమాటాలను మార్కెట్‌కు తరలిస్తున్న వాహనాన్ని దొంగతనం చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చిక్కజాల సమీపంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులు కథనం ప్రకారం.. చిత్రదుర్గలోని ఓ రైతు కోలార్‌ మార్కెట్‌కు 2 వేల కిలోల టమాటాలను తరలిస్తుండగా ముగ్గురు దుండగులు కారులో ఆ వాహనాన్ని అనుసరించారు. తమ వాహనాన్ని ఆ రైతు ఢీకొట్టాడని ఆరోపిస్తూ.. రైతు, డ్రైవరుపై దాడి చేశారు. అనంతరం వారిని నష్టపరిహారం కూడా డిమాండ్‌ చేశారు. అలా వారి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి దుండగులు టమాటాల వాహనంతో పారిపోయారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల గురించి గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. చోరీ ఘటనలు పెరుగుతుండటంతో రైతులు పొలాల వద్ద టెంట్లు వేసి కాపలా కాస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని