Rajya Sabha Polls: రాజ్యసభ స్థానాలకు మొదలైన పోలింగ్‌.. విపక్షాలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం

Rajya Sabha Polls: మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు ఇది కొనసాగనుంది.

Updated : 27 Feb 2024 10:46 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్దల సభ (Rajya Sabha)లో ఖాళీల భర్తీకి నేడు పోలింగ్‌ (Polling) ప్రారంభమైంది. మూడు రాష్ట్రాల్లోని 15 స్థానాలకు ఉదయం 9 గంటలకు ఓటింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో 10, కర్ణాటక (Karnataka)లో నాలుగు, హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఒక స్థానానికి నేడు పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎస్పీ చీఫ్‌ విప్‌ రాజీనామా..

యూపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి భాజపాకు ఏడు, సమాజ్‌వాదీ పార్టీకి మూడు స్థానాలు దక్కడం ఖాయంగానే కన్పిస్తోంది. కానీ, ఈ రాష్ట్రంలో భాజపా ఎనిమిదో అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో గట్టి పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే విపక్ష ఎస్పీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. మరోవైపు, పోలింగ్‌ కొనసాగుతున్న వేళ.. ఎస్పీ చీఫ్‌ విప్‌ మనోజ్‌ కుమార్‌ పాండే రాజీనామా చేయడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం సమాజ్‌వాదీ పార్టీ సమావేశం నిర్వహించగా.. పాండే సహా 8 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఇప్పుడు ఆయన తన పదవి నుంచి వైదొలగడం గమనార్హం. దీంతో వీరంతా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే భాజపాకు ఎనిమిదో స్థానం దక్కుతుంది.

భాజపా, కాంగ్రెస్‌ పోటాపోటీ..

ఇక హిమాచల్‌, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హిమాచల్‌లో ఒక్క స్థానానికి భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టింది. అటు కర్ణాటకలో నాలుగు ఖాళీలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. హస్తం పార్టీ చెందిన అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌లు బరిలో ఉండగా.. భాజపా నుంచి నారాయణ్‌ భాండగే, జేడీఎస్‌కు చెందిన కుపేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో క్రాస్‌ ఓటింగ్‌ జరగవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌ 2, 3 తేదీలతో ముగియనుంది. దీంతో ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 12 రాష్ట్రాల్లోని 41 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ నేతలు రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, భారాస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఎలాంటి పోటీ లేకుండా గెలిచారు. ఏపీ నుంచి మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని