ఎంఎస్‌పీపై చట్టం చేయాల్సిందే: టికాయత్‌

కొత్త సాగు చట్టాల్ని రద్దు చేయడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టం చేయాల్సిందేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్‌ చేశారు. ఆకలిపై వ్యాపారం చేయడాన్న......

Published : 08 Feb 2021 17:28 IST

రాజ్యసభలో ప్రధాని ప్రసంగంపై స్పందించిన రైతు నేత

ఘజియాబాద్‌ : కొత్త సాగు చట్టాల్ని రద్దు చేయడం సహా పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టం చేయాల్సిందేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్‌ చేశారు. ఆకలిపై వ్యాపారం చేయడాన్ని అనుమతించేది లేదని వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధరను తొలగించలేదని.. ఎప్పటికీ కొనసాగుతుందని సోమవారం పార్లమెంటులో ప్రధాని మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో టికాయత్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆకలిపై వ్యాపారం చేయడాన్ని అనుమతించబోం. ఎంత ఆకలి వేస్తే దేశంలో పంట ధరలు అంతగా పెరుగుతాయి. ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటున్న వారిని దేశం నుంచి తరిమేస్తాం. ఒకే రోజు విమాన ఛార్జీలు రెండు, మూడు సార్లు మారతాయి. పంట ఉత్పత్తుల ధరల విషయంలో మాత్రం అది జరగదు’’ అని టికాయత్‌ వ్యాఖ్యానించారు. ఆందోళనలు చేసే కొత్త వర్గం పుట్టుకొచ్చిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై టికాయత్‌ స్పందించారు. ‘‘అవును, ఈసారి రైతు వర్గం పుట్టుకొచ్చింది. ప్రజలు కూడా ఈ వర్గానికి మద్దతు తెలుపుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర తొలగించారని ఎవరూ అనలేదని.. కేవలం దాన్ని చట్టంగా మార్చాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

రైతుల ఉద్యమాన్ని కులం, మతం ఆధారంగా విభజిస్తున్నారని టికాయత్‌ ఆరోపించారు. అలాంటి చర్యల్ని తిప్పికొడతామన్నారు. ‘‘ఈ ఉద్యమాన్ని తొలుత పంజాబ్‌ అంశంగా చిత్రీకరించారు. అనంతరం సిక్కు, జాట్ల ఉద్యమంగా అభివర్ణించారు. ఈ దేశ రైతులంతా సమైక్యంగా ఉన్నారు. చిన్న, పెద్ద రైతు అంటూ తేడా ఏమీ లేదు. ఈ ఉద్యమం రైతులందరిదీ’’ అని వ్యాఖ్యానించారు.

ప్రధాని కనీస మద్దతు ధర హమీపై మరో రైతు నేత అభిమన్యు కొహార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటి వరకు అనేకసార్లు కనీస ధరపై హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ, కావాల్సింది హామీ కాదని.. దీనిపై చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

రాజ్యసభలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రైతుల ఆందోళన అంశాన్ని ప్రస్తావించారు. గతంలో వ్యవసాయ సంస్కరణల గురించి మాట్లాడిన పార్టీలు ఇప్పుడు మాటమారుస్తున్నాయని ఆరోపించారు. అలాగే కనీస మద్దతు ధరను తొలగించినట్లు వదంతులు వస్తున్నాయని.. అది నిజం కాదని తెలిపారు. మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. అయినా, రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తమ అభ్యంతరాలేమిటో చెప్పడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి...

సాగుచట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని