MK Stalin: ప్రధాన భాషగా హిందీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై మండిపడ్డ స్టాలిన్‌

హిందీని ప్రధాన భాషగా ఎంపిక విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఖండించారు.

Published : 06 Aug 2023 02:19 IST

చెన్నై: ప్రధాన భాషగా హిందీని ఎంపిక చేసే విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మేం ఎప్పటికీ హిందీ భాషకు బానిసలం కాబోము’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాన భాష ఎంపిక అంశంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ 38వ సమావేశంలో శుక్రవారం అమిత్‌ షా మాట్లాడుతూ.. విపక్షాలు అడ్డుపడుతున్నా.. హిందీని ప్రధాన భాషగా అంగీకరించాల్సిందేనని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. హిందీకి ఇతర భాషలేవీ పోటీ కాదని, అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారానే దేశం సాధికారత సాధిస్తుందని అమిత్‌షా కూడా సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.

దీనిపై స్టాలిన్‌ స్పందిస్తూ.. ‘‘అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది హిందీయేతర భాషలు మాట్లాడేవారిని లొంగదీసుకునే ప్రయత్నమే. హిందీ ఆధిపత్యాన్ని తమిళనాడు తిరస్కరిస్తుంది. మన భాష, వారసత్వమే మనల్ని నిర్వచిస్తుంది. హిందీ బాషను అనుకరించి మేం బానిసలుగా మారబోం’’ అని స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. ఈ అంశంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ‘‘ హిందీని బలవంతంగా రుద్దడంపై కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమిత్‌ షాజీ... ఈ ప్రతిఘటనను గమనించండి. తమిళనాడులో 1965 నాటి హిందీ వ్యతిరేక ఆందోళలను మళ్లీ తీసుకురావొద్దు’’ అని స్టాలిన్‌ అన్నారు.

సెంట్రల్‌ యూనివర్సిటీలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలంటూ అమిత్‌ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే.. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీని, మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషను అమలు చేయాలని, అలాగే ఇంగ్లిష్‌ను ఐచ్ఛికం చేయాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా నివేదిక సమర్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని