Bhagyasri: ఇంకా చేయాల్సింది చాలా ఉంది!

‘‘ప్రతి ఒక్కరూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. హిందీలోనూ.. దక్షిణాది సినిమాల గురించే మాట్లాడుకుంటారు. ఇలాంటి దశలో నేను తెలుగులో నటించడం సంతృప్తినిచ్చింది. తల్లిగానే కాదు...   నటనకి

Published : 06 Mar 2022 14:48 IST

‘‘ప్రతి ఒక్కరూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. హిందీలోనూ.. దక్షిణాది సినిమాల గురించే మాట్లాడుకుంటారు. ఇలాంటి దశలో నేను తెలుగులో నటించడం సంతృప్తినిచ్చింది. తల్లిగానే కాదు...   నటనకి ప్రాధాన్యమున్న ఎలాంటి పాత్రలకైనా నేను సిద్ధమేన’’ని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. కథానాయికగా... అందాల తారగా భారతీయ ప్రేక్షకులపై తనదైన ముద్రవేసిన నటి భాగ్యశ్రీ. ‘ప్రేమపావురాలు’తో తెలుగు ప్రేక్షకులకీ చేరువైంది. ‘యువరత్న రాణా’, ‘ఓంకారం’ సినిమాలతోనూ ఆమె తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. రెండు దశాబ్దాల విరామం తర్వాత ఆమె రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టింది. ‘తలైవి’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల్లో తల్లిపాత్రల్ని పోషించింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ పంచుకున్న విషయాలివీ...

‘‘కుటుంబ ప్రాధాన్యాలతో బిజీగా ఉండటంతోనే ఇన్నాళ్లూ నటనకి దూరమయ్యా. నా భర్తకి నేనంటే ప్రాణం. అందమైన నా భార్య నా ఇంట్లోనే ఉండాలనుకున్నారు. ఇప్పుడు మా పిల్లలు, భర్త సినిమాల్లో నటించమని ప్రోత్సహిస్తున్నారు. అందుకే రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టా. ‘మైనే ప్యార్‌ కియా’ తర్వాత కూడా నేను కొన్ని సినిమాలు చేశా. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటే కుటుంబ బంధాలు బాగుంటాయని భావించి బిజీగా ఉన్నా అప్పట్లో పెళ్లిపీటలెక్కా. ఇప్పుడు కుటుంబం ప్రోత్సాహంతో మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ నటిగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నా. రెండో ఇన్నింగ్స్‌ సంతృప్తికరంగా సాగుతోంది’’.


‘‘తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ ఇక్కడికి రావడం చాలా నచ్చింది. నటిగా నేను చేసింది కొన్ని పాత్రలే. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ముఖ్యంగా యువతరంతో కలిసి పనిచేయాలనేది నా లక్ష్యం. ఇదివరకటితో పోలిస్తే సినిమా చాలా మారింది. ఓటీటీ మాధ్యమాల వల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నటిగా నేను కన్న మరిన్ని కలలు నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నా’’.


‘‘నేను మళ్లీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు వచ్చిన సినిమాలు... ‘తలైవి’, ‘రాధేశ్యామ్‌’. రెండింటిలోనూ తల్లిగా బలమైన పాత్రలే.  ఈ రెండు చిత్రాలూ ఒకేసారి మొదలైనా... కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది.

* ప్రభాస్‌కి తల్లిగా నటించడం మంచి అనుభవం. ఇందులో నేను కనిపించే విధానం, నా హెయిర్‌స్టైల్‌ అన్నీ కొత్తగా ఉంటాయి.

* ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నప్పుడు సెట్లో ఎప్పుడూ కుటుంబ వాతావరణమే కనిపించేది. రుచికరమైన భోజనాన్ని సెట్స్‌కి తీసుకొచ్చేవాడు ప్రభాస్‌. అందరం కలిసి కూర్చుని తినేవాళ్లం. ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. కానీ నేనో పెద్ద స్టార్‌ని అనే గర్వం లేకుండా మెలగడం చూసి ఆశ్చర్యపోయా ’’.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని