వర్మ ఆఫీసు వద్ద ‘దిశ’ కుటుంబం ఆందోళన

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయం వద్ద దిశ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆఫీసును ముట్టడించారు. ‘దిశ’ ఘటన ఆధారంగా తీస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్రాన్ని నిషేధించాలని....

Published : 11 Oct 2020 14:38 IST

హైదరాబాద్‌: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయం వద్ద దిశ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆఫీసును ముట్టడించారు. ‘దిశ’ ఘటన ఆధారంగా తీస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్రాన్ని నిషేధించాలని కోరారు. వివాదాస్పద చిత్రాలు తీస్తున్న రామ్‌గోపాల్‌ వర్మను ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు సమాజం నుంచి వెలివేయాలని దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మీడియాతో అన్నారు. తక్షణమే యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్‌ను తొలగించాలని కోరారు. ఇప్పటికే తమ కుటుంబం ఎన్నో బాధలు అనుభవిస్తోందని, సినిమా తీసి తమను మరింత కుంగదీయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే దిశ తండ్రి సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. అభ్యంతరాలను సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణలో ఉండగా వర్మ సినిమా తీయడం, ప్రచార చిత్రాలు విడుదల చేయడం సరికాదని శ్రీధర్‌ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా దిశ సినిమాపై కేసును ఉద్దేశిస్తూ.. రామ్‌ గోపాల్‌ వర్మ శనివారం ట్వీట్‌ చేశారు. ‘దిశ ఎన్‌కౌంటర్‌ సినిమాపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. ఇది నిర్భయ కేసు నుంచి జరిగిన అనేక ఘటనల ఆధారంగా తీస్తున్న ఫిక్షనల్‌ స్టోరీ ఇది’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు