చిరు నట విశ్వరూపానికి 28ఏళ్లు

‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ వరుసగా మూడు హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న చిరంజీవి ఆ తర్వాత నటించిన వైవిధ్యమైన

Published : 09 Oct 2020 15:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ వరుసగా మూడు హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న చిరంజీవి ఆ తర్వాత నటించిన వైవిధ్యమైన క్లాస్‌ చిత్రం ‘ఆపద్బాంధవుడు’. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై (అక్టోబరు 9) 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నటనపరంగా చిరంజీవిని మరోస్థాయికి తీసుకెళ్లింది ఈ చిత్రం.

చిరు అభినయంతో ఈ చిత్రాన్ని తన భుజస్కందాలపై మోశారు. ఇక ఇందులో శివుడి పాత్రలో కనిపించి అలరించారు. చిరంజీవితో పాటు మీనాక్షి శేషాద్రి, శరత్‌బాబు, రచయిత, దర్శకుడు జంధ్యాల గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ఇక సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారు. తనదైన పాటలు, సంగీతంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి.

జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల.. ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర తానే చేస్తానని నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి చెప్పడంతో ఆయన ఈ విషయాన్ని దర్శకుడు కె.విశ్వనాథ్‌కు చెప్పారు. అలా జంధ్యాల నటించిన మొదటి, చివరి చిత్రంగా ‘ఆపద్బాంధవుడు’ నిలిచింది.

ఉత్తమ నటుడిగా రెండోసారి నంది అవార్డు అందుకోవడమే కాదు, ఆ ఏడాది జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి కేటగిరిలో చిరు గట్టి పోటీ ఇచ్చారు. ఇక ఈ చిత్రం మొత్తం ఐదు కేటగిరీల్లో నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమనటుడు, ఉత్తమ రచయిత, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ విభాగాల్లో అవార్డులు రాగా, చిరు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ సొంతం చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని