Ajith: అభిమాని ఫొటో అడిగితే.. బ్యాగు మోసిన అజిత్‌.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్‌

తనది.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వమని ప్రముఖ హీరో అజిత్‌ (Ajith) మరోసారి నిరూపించుకున్నారు. ప్రశంసలు పొందుతున్నారు. ఏం జరిగిందంటే? 

Published : 14 Apr 2023 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులెవరైనా కనిపిస్తే మనలో చాలామంది వారితో కలిసి ఫొటో దిగితే బావుణ్ను అని అనుకుంటాం. ఆ ప్రయత్నం చేయగా.. పలు కారణాల వల్ల కొందరు తారలు ‘సారీ’ చెబుతారు. ఇంకొందరు కెమెరా క్లిక్‌మనగానే వెళ్లిపోతారు. కొందరు మాత్రం అభిమానులున్న పరిస్థితి అర్థం చేసుకుని, వారికి సాయం చేస్తుంటారు. అలాంటి వారిలో అగ్ర కథానాయకుడు అజిత్‌ (Ajith) ఒకరని తాజా ఘటన చెబుతోంది. ‘సర్‌.. సెల్ఫీ ప్లీజ్‌’ అని ఓ మహిళా అభిమాని విజ్ఞప్తి చేయగా అజిత్‌ ఫొటో దిగడమే కాకుండా బ్యాగును మోసి ఆమెకు తోడుగా నిలిచారు. లండన్‌ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఆ దృశ్యాలకు ఆమె భర్త అయిన కార్తిక్‌ అక్షర రూపమిచ్చారు. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాన్ని చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు ‘అజిత్‌ అంటే ఇదీ’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏం జరిగిందో అభిమాని మాటల్లోనే.. ‘‘నా భార్య పది నెలలు వయసున్న మా బాబుతో గ్లాస్గో నుంచి చెన్నైకు బయలుదేరింది. లండన్‌ విమానాశ్రయంలో హీరో అజిత్‌ కనిపించారని, కలిసి ఫొటో దిగేందుకు ఆయన్ను కలిసింది. నా సతీమణి ఒంటరిగా ప్రయాణిస్తుందని గమనించిన ఆయన కేవలం ఫొటోకు పోజివ్వడమే కాకుండా ఆమె విమానం ఎక్కేంత వరకూ తోడుగా ఉన్నారు. ‘ఫర్వాలేదు సర్‌.. నేను చూసుకుంటా’ అని ఆమె చెబుతుండగా.. ‘నో ప్రాబ్లమ్‌. నాకూ ఇద్దరు పిల్లలున్నారు. పరిస్థితి అర్థం చేసుకోగలను’ అని వినయపూర్వకంగా స్పందించారు. ఆమె ఓ సూట్‌కేసు, బేబీ బ్యాగుతో ఇబ్బంది పడుతుందని.. ఆయనే స్వయంగా బేబీ బ్యాగును విమానం వరకు మోసుకెళ్లి, సిబ్బంది (క్యాబిన్‌ క్రూ)కి ఇచ్చి దాన్ని ఆమె సీటు వద్ద పెట్టించారు. అనంతరం, షటిల్‌ బస్సులో ప్రయాణించే సమయంలోనూ నా భార్య తాను వాటిని మోయగలనని చెప్పగా అజిత్‌ ఆమె వారిస్తూ సాయం చేశారు. ఆయన వ్యక్తిత్వం నన్ను కదిలించింది’’ అని తెలిపారు.

తనది.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అని అజిత్‌ ఎన్నో సందర్భాల్లో నిరూపించారు. అభిమానులకు అధిక ప్రాధాన్యమిచ్చే ఆయన ఈ ఏడాది సంక్రాంతికి ‘తునివు’ (Thunivu) చిత్రంతో సందడి చేశారు. తదుపరి సినిమా (#AK62) విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో ఉంటుందని ఇటీవల కోలీవుడ్‌లో వార్తలొచ్చాయిగానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ ప్రాజెక్టు రద్దు అయిందని మరో డైరెక్టర్‌తో.. అజిత్‌ తన 62వ చిత్రాన్ని తీసుకొస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని