Abbas: విశాల్‌ మాటలకు అప్పుడు ఎంతో బాధపడ్డా: అబ్బాస్‌

విశాల్‌తో ఒకానొక సందర్భంలో విభేదాలు తలెత్తినట్లు నటుడు అబ్బాస్‌ తెలిపారు. ఓ కోలీవుడ్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

Updated : 07 Aug 2023 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రేమదేశం’ సినిమాతో అప్పటి యూత్‌లో విశేష క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు అబ్బాస్‌ (Abbas). ఆ తర్వాత, ‘రాజహంస’, ‘రాజా’, ‘నీ ప్రేమకై’, ‘శ్వేతనాగు’, ‘నరసింహ’, ‘అనసూయ’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఆయన 2015లో ఇండస్ట్రీకి దూరమయ్యారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. కొన్ని రోజుల క్రితం స్వదేశానికి (చెన్నై) తిరిగొచ్చిన అబ్బాస్‌ కోలీవుడ్‌ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాటిల్లోని ఓ చిట్‌చాట్‌లో పలువురు తమిళ హీరోలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌’ (సీసీఎల్‌) విషయంలో నటుడు విశాల్‌ (Vishal)తో విభేదాలు వచ్చినట్టు తెలిపారు.

‘‘చిత్ర పరిశ్రమకు చెందిన వారందరితో మంచి బంధాన్ని పెంపొందించుకోవాలనేది నా లక్ష్యం. నటుల మధ్య సోదరభావం ఉండాలనే ఉద్దేశంతో ‘సీసీఎల్‌’ని ప్రారంభించారు. ఆ లీగ్‌ సెకండ్‌ సీజన్‌లో విశాల్‌తో మనస్పర్థలు తలెత్తాయి. అతడు నా గురించి ఇతరులకు అబద్ధాలు చెప్పేవాడు. నాకు మర్యాద దక్కని చోటు ఉండడం ఇష్టంలేక ఆటను వదిలేయాలని నిర్ణయించుకున్నా. విశాల్‌ అన్న మాటలకు అప్పుడు ఎంతో బాధపడ్డా. అతడు ఏదో ఒక రోజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని, రియలైజ్‌ అవుతాడని అనుకున్నా. ఏదేమైనా విశాల్‌ ఇప్పటికీ ఫ్యామిలీ (చిత్ర పరిశ్రమ)లో ఓ భాగం. ఏ కుటుంబంలోనైనా మనస్పర్థలు రావడం సహజం. అతడిని నేనెప్పుడో క్షమించా. అతడు నాకు ఎదురైతే ‘హాయ్‌’ అంటూ పలకరిస్తా. కానీ, మునుపటిలా సన్నిహితంగా ఉండలేను’’ అని ఆనాడు చోటు చేసుకున్న పరిణామాన్ని వివరించారు.

స్టార్‌గా ఎదిగి.. ట్యాక్సీ డ్రైవర్‌గా మారి:అబ్బాస్‌ అనుభవాలివీ

అజిత్‌ (Ajith Kumar) గురించి మాట్లాడుతూ.. ‘‘కొన్ని విషయాల్లో ఆయన, నేను ఒకేలా అనిపిస్తుంటాం. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం. అజిత్‌ అసత్యాలను సహించడు. ఇప్పటికే ఆయనకు పలు శస్త్ర చికిత్సలు జరిగాయి. పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయంటూ వైద్యులు హెచ్చరించినా ఆయన మాత్రం అభిమానులను అలరించేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నాడు’’ అని పేర్కొన్నారు.

విజయ్‌, సూర్య గురించి ఇలా..

‘‘విజయ్‌ (Vijay) చాలా సరదా వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఎందులోనూ హద్దులు దాటడు. అతడి గత చిత్రాలను నేను ఇష్టపడను. కానీ, ఇప్పుడు విజయ్‌ని అభిమానిస్తున్నా. అతడి కొత్త సినిమాల్లో సందేశం ఉంటుంది’’ అని అన్నారు. ‘‘సూర్య (Suriya) తెరంగేట్రం చేసిన సమయం నుంచే అతడు నాకు తెలుసు. తొలినాళ్లలో అతడు నలుగురిలో మాట్లాడేందుకు, కెమెరా ముందు చాలా సిగ్గుపడేవాడు. ఇప్పుడు అతనిలో మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కథల ఎంపికలో అతడికి ఉన్న స్పష్టత, సినిమాలపై అంకితభావం అభినందనీయం’’ అని అబ్బాస్‌ కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని